నాలుగైదు రోజుల్లో విధి విధానాలు పూర్తిచేస్తాం
బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సనత్‌నగర్ (హైదరాబాద్): కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, అది జరగనిదే స్థానిక సంస్థల ఎన్నిక లు జరగవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ల నియామకాల్లో కూడా నలుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ‘సమగ్ర కుల గణన–బీసీ రిజర్వేషన్ల పెంపుపై’బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బుధవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ, కులగణన అంశాన్ని తెరమీదకు తీసుకువచి్చన నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి అందాలనే ఉద్దేశంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు. నాలుగైదు రోజుల్లో కులగణనపై విధి విధానాలను ఖరారు చేసి ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర ఖజానా అధ్వాన్న స్థితిలో ఉందని, నెలసరి ఆదాయం 18 వేల కోట్లు కాగా, గత ప్రభుత్వం చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు తీర్చేందుకే ఎక్కువ శాతం ఆదాయం కేటాయిస్తూ వస్తున్నట్లు చెప్పారు.
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అనవసర ప్రాజెక్టులతో దుబారా చేసి అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కులగణన అంశాన్ని లేవనెత్తగానే బీజేపీ కూడా స్వరం మార్చి ఆర్‌ఎస్‌ఎస్‌తో మద్దతు తెలియజేస్తోందన్నారు. బీజేపీ హయాంలో పెట్టుబడిదారులకు న్యాయం జరిగిందే తప్ప ప్రజలకు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేసిందే తప్ప లాభాల్లో ఉన్న వాటి జోలికి వెళ్లలేదని, నేడు బీజేపీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు.
బీఆర్‌ఎస్ కూడా కులగణనకు మద్దతు అంటూ ఇప్పుడు చెబుతోందని, గత పదేళ్లు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కులగణన జరిపి తీరుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కులగణన చేసి తీరాల్సిందేనన్నారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కులగణనపై గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టామని, చివరిగా హైకోర్టులో కేసు కూడా వేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాము కులగణన మార్చ్ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని జాజుల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment