
గాందీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం
ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు తీసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ
ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి పలు సమస్యల పరిష్కారం
మంత్రులతో ముఖాముఖి నిరంతరంఉంటుంది: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజల నుంచి 4 గంటల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 285 దరఖాస్తులు రాగా, అందులో 30కి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న గురుకుల ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వచ్చి తమ అర్జీలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని, రేషన్‌కార్డులు కావాలని, ఉపాధి కల్పించాలని, చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సాయం చేయాలని, 108 సిబ్బందికి ఏఎన్‌ఎం ఉద్యోగ నోటిఫికేషన్లలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తులు సమర్పించారు.
గత పదేళ్లలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. తొలిరోజు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించామని, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కార దశలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పాయి.
అద్భుత ఆలోచన: మంత్రి దామోదర
గాంధీభవన్‌లో ప్రజావాణి చేపట్టడం అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే కనీసం వారి గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు తాము ప్రజల సమస్యలు విని పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలకు పంపుతామని, వీలున్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్
కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు, కార్యకర్తలంటే ఎంతో గౌరవమని, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్‌లో ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతారని, వారి సమస్యలపై అర్జీలు తీసుకుంటారని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన కార్యక్రమ ప్రారంభ సభలో చెప్పారు.