సాక్షి, ఒంగోలు: ‘అయ్యా..నా స్థలం కబ్జా చేశారని ఎమ్మార్వోకు అర్జీఇస్తే, పట్టించుకోవడం లేదయ్యా.. రోజూ ఆఫీసుకు తిరుగుతూనే ఉన్నాను.’ ‘సారూ.. కాళ్లులేని అవిటివాడినని కూడా చూడకుండా.. పింఛన్‌కార్డు రాయడానికి పదేపదే అధికారులు తిప్పించుకుంటున్నారండీ..’ అంటూ కలెక్టర్ విజయ్‌కుమార్ వద్దకొచ్చి బాధితులు గోడువెళ్లబోసుకుంటున్నారు.
ఒంగోలులో ప్రతీ సోమవారం జరిగే ‘ప్రజాదర్బార్’కు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి తమ సమస్యలను జిల్లా అధికారులకు ఏకరువు పెడుతున్నారు. అధిక శాతం అర్జీల్లో వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ప్రతీ సోమవారం ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజాదర్బార్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ, బాధితులు అక్కడకు వెళ్లకుండా.. నేరుగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు: ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను అందించేందుకు జిల్లా కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్తున్నా ఫలితం ఉండటం లేదు. భూముల అన్యాక్రాంతం, సరిహద్దుల సర్వేకొలతల దరఖాస్తులు, పన్ను మదింపు, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర సమస్యలపై అర్జీలు తహశీల్దార్ కార్యాలయాల్లో అధికసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నిచోట్ల సిబ్బంది లంచాల బాగోతంపైనా జిల్లా అధికారులకు ఫిర్యాదులొస్తున్నాయి.
జిల్లా అధికారులు తమ దృష్టికి వచ్చిన అర్జీలపై సంతకాలు చేసి మరలా మండల స్థాయి అధికారులకే సిఫార్సులు పంపుతున్నారు. దీంతో బాధితులకు మరిన్ని కొత్తసమస్యలు ఎదురవుతున్నాయని.. తమను నమ్మకుండా నేరుగా జిల్లా అధికారుల దగ్గరకు వెళ్తారా..?అంటూ కక్షసాధింపు చర్యలెదురవుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
అర్జీలు కొండంత.. పరిష్కారాలు గోరంత..
జిల్లాకేంద్రానికి ఈఏడాది ఆరంభం నుంచి జూన్ మూడోవారం వరకు అందిన అర్జీలను పరిశీలిస్తే.. మొత్తం 24,716 గ్రీవెన్స్‌కు గాను ఇప్పటికీ వాటిల్లో 8090 సమస్యలు మాత్రమే పరిష్కరించారు. 2361 అర్జీలు అధికారుల తిరస్కరణకు గురవగా, పరిష్కార దశలో 5734 దరఖాస్తులున్నాయి. ఇంకా 8492 అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్‌కు 5742 అర్జీలు రాగా, వాటిల్లో 74 మాత్రమే పరిష్కారమయ్యాయి. డీఆర్‌డీఏ పరిస్థితి అదేతీరుగా ఉంది. 1195 సమస్యలు అధికారుల దృష్టికిరాగా వాటిల్లో 250 సమస్యలనే పరిష్కరించారు.