
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అడ్డదారిలోనైనా సరే అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజక వర్గంలో నాలుగు నుంచి ఐదు వేల ఓటర్లను తొలగించడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం దీని కోసమే నగర దీపికలు అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీడీపీ ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. బతికి ఉన్నవాళ్లను చనిపోయినట్లుగా, ఊళ్లో ఉన్నవాళ్లు వలస పోయినట్లుగా చూపించి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వల్లే టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జాగ్రత్త
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలికి ఓట్లను తొలగిస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాబట్టి... వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఓటరు జాబితాలో తమ ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ లేనట్లైతే ఎందుకు తొలగించారో సంబంధిత అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment