
సాక్షి, అనంతపురం : హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఇటీవలే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రతో రాజకీయాలవైపు ఆకర్షితులైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరారు.
కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment