సాక్షి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ కంచుకోట బద్దలైంది. ఆ పార్టీకి ఎదురులేని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ విజయకేతనం ఎగురవేశాడు. ఏకంగా 1.38 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించాడు. గురువారం స్థానిక ఎస్కేయూ క్యాంపస్‌లో కౌంటింగ్ ప్రక్రియ సాగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తూనే మరోవైపు ఈవీఎంలను లెక్కించారు. మొత్తం 25 రౌండ్లు సాగిన కౌంటింగ్ తొలిరౌండ్ నుంచే గోరంట్ల మాధవ్ తన సమీప అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై స్పష్టమైన మెజార్టీ కనబరిచాడు. నిమ్మల కిష్టప్ప ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. తొలిరౌండులో 9184 ఓట్ల ఆధిక్యంతో గోరంట్ల మాధవ్ బోణీ చేశాడు. అప్పటి నుంచి తిరిగిచూడలేదు. మొత్తం 25 రౌండ్లు కౌంటింగ్ జరగగా టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప 17వ రౌండులో 1090 ఓట్లు, 24వ రౌండులో 225 ఓట్లు ఆధిక్యత సాధించాడు. తక్కిన 23 రౌండ్లు వైఎస్సార్‌సీపీ ఆధిక్యత చాటింది. మొత్తం 13,23,991 ఈవీఎం ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 6,98,422 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థికి 5,60,113 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేటీ శ్రీధర్ 26,934 ఓట్లు సాధించాడు. ఇక నాల్గోస్థానంలో ‘నోటా’కు 17,320 ఓట్లు వచ్చాయి. అలాగే భారతీయ జనతాపార్టీ అభ్యర్థి మిట్టా పార్థసారథి 13,485 ఓట్లు సాధించాడు. ఇతరులు 7717 ఓట్లు దక్కించుకున్నారు. గోరంట్ల మాధవ్ రౌండు రౌండుకు మెజార్టీ పెరుగుతుండడంతో పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం ఆవరణలోనే ఆయన్ను హత్తుకుని గంతులేశారు.
మెజార్టీపై చర్చ
హిందూపురం ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ సాధిచిన మెజార్టీపై నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల ప్రజల్లో విపరీతమైన చర్చ జరిగింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రమంతా వైఎస్సార్ గాలి వీచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ హిందూపురం ఎంపీగా బరిలో నిలిచిన కర్నల్ నిజాముద్దీన్ కేవలం 1840 ఓట్లతో గట్టెక్కాడు. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీ తరపున ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన గోరంట్ల మాధవ్ ఏకంగా 1,38,309 ఓట్లు మెజార్టీ సాధించడం చర్చనీయాంశమైంది.
సామాన్యుడిని బరిలో దింపి..
హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరూ ఊహించిన విధంగా వైఎస్సార్‌సీపీ సామాన్యుడైన మాధవ్‌ను బరిలో దింపింది. పోలీసుశాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. కురుబ కులానికి చెందిన మాధవ్‌ను పోటీలో పెట్టడంతో అధికార పార్టీ నాయకులు హేళన చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకుడైన నిమ్మల కిష్టప్ప విజయం నల్లేరుమీద నడకే అని అధికార పార్టీ భావించింది. అయితే వారి అంచనాలు పటాపంచలు చేస్తూ మాధవ్ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment