గొట్టిపాటి దీక్ష భగ్నం | Gottipati Ravikumar Deeksha Stopped By Police | Sakshi
Sakshi News home page

గొట్టిపాటి దీక్ష భగ్నం

Published Mon, Oct 7 2013 3:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

Gottipati Ravikumar Deeksha Stopped By Police

 అద్దంకి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం అద్దంకి నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం ఉదయం భగ్నం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఆయన్ను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సమైక్య శంఖారావంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గొట్టిపాటి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. శనివారం మధ్యాహ్నమే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యాధికారులు చెప్పారు. తక్షణమే దీక్ష విరమించాలని సూచించినా రవికుమార్ అంగీకరించలేదు.
 
 ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో ఉన్నతాధికారల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి వైద్యాశాలకు తరలించాలని శనివారం మధ్యాహ్నమే విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో దీక్ష శిబిరం వద్దకు వచ్చి గొట్టిపాటికి వలయంగా ఏర్పడ్డారు. పోలీసులు రెండు సార్లు  వచ్చి వెనుదిరిగి వెళ్లారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యాధికారి టి.వెంకటేశ్వర్లు శిబిరం వద్దకు వచ్చి పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొట్టిపాటి ఆరోగ్య స్థితిపై పోలీసులకు నివేదిక ఇచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు అంబులెన్స్‌తో దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించగా వందలాది మంది కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నెట్టివేసుకుంటూ రవికుమార్‌ను అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు భారీగా ఒంగోలు తరలి వెళ్లారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement