ఆస్తిపన్నుపై సర్కార్ కన్ను !
జిల్లాలోని మునిసిపాలిటీలు, నగరాల్లో ఉన్న భవనాల కొలతలు సరిచేయడం, పన్ను తక్కువగా వస్తున్న భవనాలను గుర్తించి సరైన పన్ను విధించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లతో పాటు ఆరు మునిసిపాలిటీల్లో భవనాల కొలతలు, పన్ను వివరాలు సరిచేయాలని రాష్ట్ర పురపాలన పరిపాలన శాఖ (డీఎంఏ) కమిషనర్లను ఆదేశించింది.
- భవన విస్తీర్ణం పునః పరిశీలన
- మునిసిపాలిటీల్లో ఎనిమిది వారాల ప్రణాళిక
- వాణిజ్య భవనాలను వదలొద్దు
- పురపాలకశాఖ నుంచి ఆదేశాలు
జిల్లాలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీలు ఉన్నాయి. తిరుపతిలో 60,619 భవనాలకు ప్రతి అర్ధ సంవత్సరానికి రూ.28.41 కోట్లు, చిత్తూరు నుంచి 29,636 భవనాలకు ఆర్నెల్లకు రూ.4 కోట్లు, మదనపల్లెలో 16,640 భవనాలకు గానూ 1.43 కోట్లు, పుంగనూరులో 7726 భవనాలకు 1.56 కోట్లు, పలమనేరులో 9,606 భవనాలకు రూ.1.08 కోట్లు, శ్రీకాళహస్తిలో 60,619 భవనాలకు రూ.2.84 కోట్లు, పుత్తూరులో 9,892 భవనాలకు రూ.89.31 లక్షలు, నగరిలో 12,441 భవనాలకు రూ.88.08 లక్షల ఆస్తి పన్ను రూపంలో వసూలవుతోంది.
ఈ భవనాల్లో ఇళ్లకు ఓ రేటు, వాణిజ్య సముదాయాల నుంచి ఓ రేటు, కర్మాగారాల నుంచి ఓ రేటు రూపంలో అధికారులు ఆస్తి పన్ను వసూలు చేస్తారు. చాలా పట్టణాలు, నగరాల్లో వాణిజ్య భవనాల నుంచి చాలా తక్కువ మొత్తంలో ఆస్తిపన్ను వసూలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎన్నో ఏళ్ల క్రితం గృహ అవసరాలకు ఉన్న భవనానికి వేసిన పన్నునే ఇప్పటికీ వాణిజ్య భవనాల నుంచి వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాత పన్నులు సరిచేయడానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎనిమిది వారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు.
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే బిల్ కలెక్టర్లు పన్నులు వేయని రెండు భవనాలను గుర్తించడంతో పాటు, తక్కువ పన్ను వస్తున్న నాలుగు భవనాలను గుర్తించి పన్ను పెంచాలని డీఎంఏ నుంచి ఆదేశాలు అందాయి. అలాగే పేరుకు నివాసగృహాలుగా చూపుతూ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే భవనాలకు వ్యాపార జోన్‌గా గుర్తించి వాటి నుంచి కొత్త పన్ను వసూలు చేయాలని కమిషనర్లను, రెవెన్యూ అధికారులను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. ఇప్పటికే అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం, తాజాగా పన్నుల వసూళ్లపై దృష్టి సారించి ప్రతి మునిసిపాలిటీలో పది శాతం పన్ను పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర్వులు జారీ చేసింది.