ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసే కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు మంజూరైంది.
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్ : ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసే కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు మంజూరైంది. కొంత కాలంగా సిద్దిపేట కేంద్రంగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రయత్నం సఫలీకృతమైంది. గతేడాది క్రితం సిద్దిపేట పట్టణంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఎమ్మెల్యే హరీష్‌రావు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. అంతేగాక నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి పల్లంరాజును వ్యక్తిగతంగా కలిసి విద్యాలయం ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.
అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సిద్దిపేటలోని ఎన్‌సాన్‌పల్లి శివారు విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వ స్థల పరిశీలన జరిగింది. ఈ కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సీబీఎస్‌ఈ సిలబస్ ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఓ కేంద్రం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో విద్యాలయంగా సిద్దిపేటలో ఏర్పాటు కానుంది.
ప్రస్తుతానికి వచ్చే విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రారంభించి వెను వెంటనే దానిని 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే హరీష్‌రావు న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం హర్షించ దగ్గ విషయమన్నారు. సిద్దిపేటలో ప్రస్తుతానికి బీసీ వసతి గృహంలో తాత్కాలికంగా విద్యాలయాన్ని కొనసాగిస్తామని, కలెక్టర్ సహకారంతో సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. తన మరో ప్రయత్నం సఫలీకృతం అయితే కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు.