సాక్షి, సంగారెడ్డి: అన్నదాతల విషాదంతంపై అధికారులు అపహాస్యమాడుతున్నారు. రైతన్న ఆత్మహత్యలపై కట్టు కథలు అల్లుతున్నారు. ఆత్మహత్యల వెనక అన్నీ వ్యవసాయేతర కారణాలేనని వక్రభాష్యం చెప్పేస్తున్నారు. ఆర్డీఓ/సబ్ కలెక్టర్ చెర్మైన్‌గా, డీఎస్పీ, ఏడీఏలు సభ్యులుగా ఉండే విచారణ కమిటీ బాధితలను కలుసుకుని వాస్తవాలను వెలికి తీయాల్సి ఉండగా.. ఆ బాధ్యతను తహశీల్దార్లపై పడేశారు. తహశీల్దార్లు కనీసం బాధిత కుటుంబాలను సంప్రదించకుండా ఆఫీసుల్లో/ చెట్ల కింద కూర్చొని ఇష్టమొచ్చినట్లు నివేదికలు రాసేస్తున్నారు. నేతలు, బినామీలకు కోట్ల రూపాయల అక్ర మ ప్రయోజనం కలిగించడానికి ఎంతటికైనా తెగించే అధికార ‘గుణం’ రైతు ఆత్మహత్యలపై విచారణ విషయానికొచ్చేసరికి కఠినంగా వ్యవహరిస్తూ ‘సారు యమ స్ట్రిక్టు’ అనిపించుకుంటున్నారు.
సదాశివపేట మండలంలో చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యలపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం జరిపిన పోస్టుమార్టం ఇలాంటిదే. మండలంలో 16 మంది రైతు లు ఆత్మహత్యకు పాల్పడితే ఇద్దరి కుటుంబాలు మాత్రమే పరిహారానికి అర్హులని సిఫారసు చేశారు. మిగిలిన 14 బాధి త కుటుంబాల అర్జీలను నిర్దయగా తోసిపుచ్చారు. అప్పుల భారాన్ని మోయలేక అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడితే .. అసలవి ‘రైతు ఆత్మహత్యలే కాదు..’ అని నివేదికల్లో స్పష్టం చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులు, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని తేల్చేశారు.
ఈ ఆత్యహత్యలపై గతంలో సమర్పించిన నివేదికల సారాన్ని సంక్షిప్త నివేదిక రూపంలో సదాశివపేట తహశీల్దార్ కార్యాలయం సంగారెడ్డి ఆర్డీఓకు సమర్పించింది. మొక్కుబడిగా ఉన్న ఈ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. అందులో పేర్కొన్న అంశాలపై నిర్ధారణ కోసం కొన్ని బాధిత కుటుంబాలను వారి ఇళ్ల వద్దే కలుసుకుంది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడితే అధికారులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాతే పునర్విచారణ కోసం మాత్రమే ఇటీవల వచ్చి వెళ్లారని స్పష్టం చేశారు. అధికారుల విచారణ నివేదికలతో పోల్చితే బాధిత కుటుంబాల ఆవేదనల మధ్య అసలు పొంతనే లేకుండా పోయింది. అధికారుల నివేదికలు, బాధిత కుటుంబాల గోడు మధ్య వ్యత్యాసం ఇది..
తిరస్కరించిన ఇతర కేసులు ఇవే : కొర్మాని పాపయ్య(పొట్టిపల్లి), తెనుగు సురేష్(మాచిరెడ్డిపల్లి), బర్ల శ్రీనివాస్(ముబారక్‌పూర్), ఎర్రగొల్ల మల్లేషం(ఆత్మకూర్), జీ అంజయ్య(చందాపూర్), వెండికోలు పద్మమ్మ(మద్దికుంట), అనసుజ(సదాశివపేట), శాంతమ్మ(సదాశివపేట), న్యాయకోటి రాజు(సదాశివపేట).
జీఓ 421తో 420 ఆటలు
ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు 2004 జూన్ 1న జీవో 421 జారీ అయ్యింది. బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారంతో పాటు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద అప్పులు తీర్చడానికి రూ.50 వేలను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. ఆర్డీఓ/సబ్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎస్పీ, ఏడీఏలు సభ్యులుగా ఉండే కమిటీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి నిర్ధారించిన తర్వాత ఈ పరిహారం మంజూరు చేయాలి. ఆత్మహత్మకు పాల్పడిన రైతు కుటుంబం ఆ విషాదం నుంచి బయటపడడానికి స్థానిక తహశీల్దార్, మండల వ్యయసాయ అధికారి సహకరించాలని బాధిత కుటుంబం భవిష్యత్తులో వ్యవసాయం ద్వారా జీవనాధారం పొందేలా అండగా ఉండాలి. అవసరమైన మేరకు పంట మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరుల్లో మార్పులను సూచించి ఆ కుటుంబ జీవనాధారాన్ని పునరుద్ధరించాలి. 421 జీవోలోని ఈ ఆదేశాలను అధికారులు విస్మరిస్తున్నారు. మొక్కుబడిగా నివేదికలు ఇచ్చి బాధిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు.