అమ్మా, అక్కా, చెల్లి, తమ్ముడు జాగ్రత్త బిడ్డా..!
జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కరువు ప్రభావంతో పంటలు ఎండిపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక..
బతుకు భారమై చావుకు చేరువవుతున్నారు.
తాజాగా బుధవారం మరో ఇద్దరు రైతులు మృతి చెందగా మరో రైతు ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రి పాలయ్యాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు
* జిల్లాలో మరో ఇద్దరు మృతి
* ఉరివేసుకుని ఒకరు.. గుండెపోటుతో మరొకరు
శివ్వంపేట: బోరుబావులను నమ్ముకుని లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పంటసాగు చేశాడు. కానీ కాలం కలిసి రాలేదు. పంట చేతికి వచ్చే పరిస్థితి కానరాలేదు. దీంతో బతుకు భారమైన రైతు అమ్మా, అక్కా, చెల్లి, తమ్ముడు జాగ్రత్త బిడ్డా అంటూ కొడుకును అప్రమత్తం చేస్తూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన పుల్లగారి శంకర్(45)కు ఐదు ఎకరాల భూమి ఉంది.
ఇందులో ఉన్న బోరుబావులను నమ్ముకుని సుమారు రూ.4లక్షలు అప్పులు చేసి వరి, మొక్కజొన్న, పత్తి పంటలు వేశాడు. కానీ కరువు పరిస్థితిల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి కానరాలేదు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో మనస్థాపానికి గురైన శంకర్ బుధవారం తెల్లవారుజామున 4గంటలకు పొలానికి వెళ్లాడు. 5 గంటలకు పెద్ద కుమారుడు వినోద్‌కుమార్‌కు ఫోన్‌చేసి అమ్మా, అక్కా, చెల్లి, తమ్ముడిని భాగా చూసుకోవాలని, అందరూ పైలంగా ఉండాలని చెప్పి మామిడిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, కుమార్తెలు మేఘమాల, నాగలక్ష్మి, కొడుకులు వినోద్‌కుమార్, వేణుగోపాల్ ఉన్నారు. కాగా పెద్ద కూతురు మేఘమాల గ్రామంలోనే వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తుంది. అందరితో కలుపుగోలుగా ఉండే రైతు శంకర్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని తహశీల్దార్ రాజయ్య పరిశీలించారు.