అప్పుల బాధతో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సాక్షి నెట్‌వర్క్: అప్పుల బాధతో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మం డలం ఎల్లకొండకు చెందిన పి.మల్‌రెడ్డి(38), మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన రూసిని లక్ష్యయ్య(40), నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామానికి చెందిన నోముల శేఖర్ (23) బలవన్మరణానికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లాలో మంగళవారం ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి మండలం చౌలమద్దికి చెందిన మహిళారైతు రాచర్ల లక్ష్మి(43), ముస్తాబాద్ మం డలంగూడెం గ్రామానికి చెందిన సోమిరెడ్డి భూమయ్య(60) బలవన్మరణాలకు పాల్పడారు.
మరో ఇద్దరికి గుండెపోటు
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం వట్టెంలకు చెందిన రైతు రావికంటి వెంకటి(60) తన భూమితోపాటు, కౌలుకు తీసుకున్న 8 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడికి అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి రాలేదు. దీనికితోడు ఈ నెల 19న ఆయన రెండో కుమార్తె వివాహం చేయాలని నిశ్చయించారు. దిగుబడి లేకపోవడంతో అప్పులెలా తీర్చాలనే బెంగతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలనే మనోవేదనతో మంగళవారం చేనులోకి తీసుకెళ్లి గుండెపోటుకు గురై చనిపోయాడు. సైదాపూర్ మండలం గుజ్జులపల్లికి చెందిన గూళ్ల మల్లయ్య(55) ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసకుని పత్తి వేశాడు. పెట్టుబడికి రూ.5 లక్షలు అప్పు అయింది. వర్షాలు లేక దిగుబడి వచ్చే అవకాశం కనిపించలేదు. కుమార్తె పెళ్లి ఎలా చేయాలని, అప్పు ఎలా తీర్చాలని మనోవేదనతో మంగళవారం గుండె ఆగి మరణించాడు. మల్లయ్యకు భార్య వనమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.