ఆగని రైతు ఆత్మహత్యలు
9 మంది బలవన్మరణం
సాక్షి నెట్‌వర్: ఆరుగాలం కష్టపడినా అప్పులు తీరకపోవడంతో మనస్తాపానికి గురై తెలంగాణ జిల్లాల్లోని రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు వివిధ జిల్లాల్లో తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఐదుగురు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన రైతు ఇరుగురాల తిరుపతి(26), వ ర్షాలు లేక వేసిన పత్తి దిగుబడి రాక అప్పుల పాలయ్యాడు. మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగి మరణించాడు. సిరిసిల్ల మండలం ఇందిరానగర్ పరిధి భరత్‌నగర్‌కు చెందిన రైతు కాటు అంజయ్య(52), మొత్తం అప్పు రూ.3.50 లక్షలు తీర్చే మార్గం కనిపించక సోమవారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. కాటారం మండలం గంగారానికి చెందిన రైతు సంతోషం బక్కమల్లయ్య(48), రెండేళ్లుగా పెట్టుబడి, కౌలు కోసం రూ.5 లక్షలు అప్పుచేశాడు.
వీటితోపాటు కుమార్తె వివాహం కోసం తెచ్చిన అప్పులు భారంగా మారాయి. అప్పు తీరే మార్గం కనిపించక మనస్తాపం చెంది సోమవారం క్రిమిసంహారక మందు తాగాడు. ముస్తాబాద్ మండలకేంద్రానికి చెందిన రైతు అనమేని యాదగిరి(55) రూ.4 లక్షల అప్పులు తీర్చాలనే మనస్తాపంతో సోమవారం పురుగుల మందు తాగాడు. శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు చెందిన రైతు పంజాల పర్శరాములు(47) పత్తి దిగుబడి సరిగా రాలేదని మనస్తాపం చెంది సోమవారం ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామపంచాయతీ పెద్దగట్టుకు చెందిన రైతు జఠావత్ పంతి(58) మొత్తం రూ.3 లక్షలు అప్పు తీరే మార్గం కనిపించక సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగాడు. ఇదే జిల్లా శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని జాలోనిగూడేనికి చెందిన రైతు కడారి సోమయ్య(65) ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, అప్పుల వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పెన్‌పహాడ్ మండలం మాచారానికి చెంది దూబని సైదులు(39) వరి, పత్తి, కంది పంటలు సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి రాలేదు. రూ. 5 లక్షలు అప్పు తీర్చే మార్గం కనిపించక సోమవారం సాయంత్రం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఖానాపూర్‌కి చెందిన బొక్కశ్రీను(40) మొక్కజొన్న, పత్తిపంటలను సాగుచేశాడు. దీనికిగాను రూ.రెండున్నర లక్షల వరకు అప్పయింది. వర్షాభావంతో వేసిన పంటలు చేతికందలేదు. మనస్తాపానికి గురైన రైతు సోమవారం పొలానికి వెళ్లి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.