♦ ముగ్గురు రైతుల ఆత్మహత్య
♦ చెలుకలపల్లిలోయువ రైతు...
చిన్నకోడూరు: అప్పులు చేసి బోర్లు వేశాడు. బోర్లతో పంట సాగు చేసుకుని బతుకుదామనుకుంటే చుక్క నీరు పడలేదు..ఒక పక్క వర్షాభావం... మరో పక్క కరువు ప్రభావంతో ఉన్న ఊరిలో ఉపాధిలేక దుబాయ్‌కు వలస వెళ్లాడు. అక్కడా సరైన ఉపాధి లేక తిరిగొచ్చాడు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతగిరి రిజర్వాయర్ నిర్మాణంతో తనకున్న సాగు భూమి ముంపునకు గురువబోతోంది. దీంతో అప్పులు తీర్చే మార్గం కనబడకపోవడం, కుటుంబాన్ని ఎలా పోషించాలని బెంగ ఆ యువ రైతును ఉక్కిరిబిక్కిరి చేశాయి. మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చెలుకలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన చౌదరి తిరుపతి(30)కి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండేళ్ల క్రితం పంటల సాగుకు అప్పులు చేసి రెండు బోర్లు వేశాడు. చుక్క నీరు పడలేదు. ఉన్న ఊరిలో ఉపాధిలేక కుటుంబ పోషణకు అప్పులు చేసి దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడా సరైన ఉపాధి లేక ఆరు నెలల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక్కడ సాగు చేసుకుని బతుకుదామంటే కరువు పరిస్థితులు నెలకొనడంతోపాటు అంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలో తనకున్న 4 ఎకరాల సాగు భూమి ముంపునకు గురవనుందని తెలిసింది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలి? కుటుం బాన్ని ఎలా పోషించాలి? అనే బెంగ అతడిలో పెరిగిపోయింది. ఈ క్రమంలో భార్య, పిల్లలు వేరే ఊరికెళ్లారు. తీవ్ర మనస్తాపం చెందిన తిరుపతి బుధవారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గురువారం విషయాన్ని గమనించిన ఇతర రైతులు పరిశీలించేసరికే తిరుపతి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు ఎస్‌ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువ రైతు తిరుపతి మృతి చెందడం, ఉన్న సాగు భూమి ముంపునకు గురికాబోతుండడంతో భార్యా, పిల్లలు రోడ్డున పడే ప్రమాదముంది. ఇల్లు, భూమి ముంపునకు గురికాబోతుండడం, అప్పులు పెరిగిపోవడం, కుటుంబ పెద్ద దిక్కు బలవన్మరణానికి పాల్పడడంతో తమకు దిక్కెవరని భార్య, కుమారుల రోదనలు అందరిని కలచివేశాయి.
కడ్పల్‌లో ఒకరు...
కల్హేర్: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని కడ్పల్‌లో గురువారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన లొద్ద కాశీరాం(35) అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెందాడు. గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. మృతుడి తండ్రి హన్మంత్ పేరిట గ్రామంలో 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. హన్మంత్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు చెరిసగం భూమిని తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. మృతుడు కాశీరాం ఇటివలే ట్రాక్టర్ కోనుగోలు చేశాడు. దాన్ని కొనేందుకు అప్పులు చేశాడు. ట్రాక్టర్ కోసం నెలవారీ కిస్తీలు కట్టలేకపోయాడు. కరువుతో పంటలు పండక అప్పులు రోజు రోజుకు మరిం త భారంగా పరిణమించాయి.
చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో కాశీరాం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. మొత్తం రూ. 5 లక్షల వరకు అప్పులైనట్లు చెప్పారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, కొడుకు సాయి, మరో పాప ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే కాశీరాం ఆత్మహత్య చేసుకోవడంతో కడ్పల్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిర్గాపూర్ పోలీసులు, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ పరమేశ్వర్, కాంగ్రెస్ నాయకులు యాదవరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కాశీరాం మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
చికిత్సపొందుతూ మరొకరు..
జగదేవ్‌పూర్: ఓ వైపు అప్పుల బాధలు, మరో వైపు ఇంట్లో గొడవలతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ వీరన్న కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు వెంకటేశం(38) అనే యువకుడు గ్రామంలో తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో జగదేవ్‌పూర్‌లో హమాలీ పనులు చేస్తున్నాడు. ఇటీవల రెండు గేదెలు, ఒక ఆవును కొనుగోలు చేశాడు.
అయితే నెల రోజుల క్రితం ఒక గేదె, ఆవు మృతి చెందాయి. ఓ వైపు పంటసాగులో నష్టాలు రావడం, మరోవైపు రెండు పశువులు మృతి చెందడంతో అప్పులు భారమయ్యాయి. కొంత కాలంగా ఇంట్లో అప్పుల బాధలతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేశం ఈ నెల 15న రాత్రి తన పొలం దగ్గర పురుగుల మందు సేవించి అపస్మారకస్థితిలో పడిపోయాడు. రాత్రి అయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జగదేవ్‌పూర్ అంతా గాలించి, చివరికి పొలానికి వెళ్లి చూసేసరికి గుడిసెలో కిందపడి ఉన్నాడు. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరన్న తెలిపారు.