ప్రాణం గిలగిల | Government hospitals not responding to patients | Sakshi
Sakshi News home page

ప్రాణం గిలగిల

Published Thu, Dec 5 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

Government hospitals not responding to patients

పెద్దాసుపత్రి వైద్యులు నాడి చూస్తే చాలు వ్యాధి నయమైనట్లే. ఈ భావన స్థానికులతో పాటు చుట్టుపక్క మరో ఐదు జిల్లాల ప్రజలను ఇక్కడికి రప్పిస్తోంది. పేదల పాలిట సంజీవనిగా పేరొందిన ఈ ఆసుపత్రి నేడు నలుగురిలో చులకన అవుతోంది. ఓపిక లేకపోతే ఇప్పుడిక్కడ ఓపీ టిక్కెట్టు కూడా పొందలేని దయనీయ పరిస్థితి నెలకొంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముగిసే లోపు ఉన్న కాస్త ప్రాణం కూడా హరీమంటోంది.
 
 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితి. వైద్యం ఉచితమే అయినా.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తీసుకొస్తోంది. ప్రధానంగా పర్యవేక్షణ లోపించడంతో సుదూర ప్రాంతాల నుంచి ఆసుపత్రిని ఆశ్రయించే నిరుపేదలకు నిరాశే మిగులుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు స్వయంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో కలియతిరిగినా ఫలితం లేకపోతోంది. చాలా మంది వైద్యులు, సిబ్బంది తీరు మేమింతే అనే తరహాలో ఉంటోంది. 38 విభాగాలు.. దాదాపు 3వేల ఓపీ రోగులు.. వెయ్యి మందికి పైగా ఇన్‌పేషెంట్లు చికిత్స పొందే ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
 
  జిల్లాతో పాటు అనంతపురం, కడప, ప్రకాశం, మహబూబ్‌నగర్, బళ్లారి, రాయచూరు జిల్లాల ప్రజలకు పెద్దదిక్కుగా పేరొందినా.. ఇటీవల కాలంలో ఆ స్థాయి వైద్య సేవలు అందించలేకపోవడం విమర్శలకు కారణమవుతోంది. అత్యవసర చికిత్స కోసం క్యాజువాలిటీకి వస్తే అనుభవజ్ఞులైన వైద్యులు కనిపించని పరిస్థితి. గంటల పాటు నిరీక్షించినా వారు చేరుకునేలోపు ఊపిరి ఆగుతోంది. గుండెజబ్బులు ఉన్న వారు క్యాజువాలిటీకి వస్తే ఇక ఇంటికి పోయేంత వరకు నమ్మకం లేదనే భావన నెలకొనడం ఈ విభాగంలో అందుతున్న సేవలకు నిదర్శనం. ఇక రోడ్డు ప్రమాద క్షతగాత్రులు వస్తే.. ఎక్స్‌రేలు, సీటీస్కాన్‌లు తీయించేందుకు వైద్యులు రెఫర్ చేయడం.. వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్లు లేక రోగుల కుటుంబ సభ్యుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చే సరికి వైద్యులు వెళ్లిపోతుండటంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి.
 
 మూలనపడ్డ బయోమెట్రిక్ విధానం
 వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తే రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చనే ఆలోచనతో డీఎంఈ గత ఏప్రిల్ నుంచి ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన విధానం అంతే త్వరగా అటకెక్కింది. కొందరు వైద్యులు బాహాటంగా బయోమెట్రిక్ సిస్టమ్‌ను వ్యతిరేకించడంతో పాటు సీఎల్‌జీలో ఏర్పాటు చేసిన పరికరాన్ని పాడు చేశారు.
 
  ఈ విషయం నిర్ధారణ అయినా బాధ్యులపై చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయారు. ప్రతిరోజూ వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలి. అలాంటిది కొందరు వైద్యులు ఉదయం 9 గంటలకు బదులు 10.30 గంటలకు రావడం.. మధ్యాహ్నం 1 గంటలోపే ఇళ్లకు వెళ్లిపోవడం చేస్తున్నారు. స్టాఫ్‌నర్సులు ఉదయం 7 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు పనిచేయాల్సి ఉండగా.. కొందరు గంట ఆలస్యం వస్తూ.. గంట ముందుగానే వెళ్లిపోతున్నారు. ఇక నాల్గో తరగతి సిబ్బంది వారి విధుల్లో వేరే మనుషులను పెట్టుకొని డుమ్మా కొడుతున్నారు.
 
 ఆర్‌ఎంవోలు లేక పర్యవేక్షణ కరువు
 ఆసుపత్రిలోనే నివాసం ఉంటూ పర్యవేక్షణ చేసేందుకు రెసిడెన్సియల్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంవో) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఏఆర్‌ఎంవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం చొరవ చూపని పరిస్థితి. దీంతో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ శివప్రసాద్‌రెడ్డిని తాత్కాలిక ఏఆర్‌ఎంవోగా సూపరింటెండెంట్ నియమించారు. ఎవ్వరూ లేకపోవడంతో మూడు ఆర్‌ఎంవో పోస్టులను కూడా ఈయనే నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలోని అనేక మంది వైద్యులకు ఈయన జూనియర్ కావడంతో మాట వినే వారు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపరింటెండెంట్ వారానికోసారి మాత్రమే పర్యవేక్షణ చేస్తుండటంతో సిబ్బంది ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
 
 ఆసుపత్రిలో కంపు కంపు
 ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. ఏజిల్ అనే సంస్థ 180 మంది కార్మికులను చేర్చుకుని పనులను చేపడుతోంది. ప్రతి నెలా ఈ సంస్థకు ప్రభుత్వం రూ.18లక్షలు చెల్లిస్తోంది. అయితే నిర్వహణలో ఈ సంస్థ పూర్తిగా విఫలమైంది. ఆసుపత్రిలోని వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. వార్డుల్లోని బాత్‌రూంలలో మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో కంపు కొడుతోంది. జూలై నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏజిల్ సంస్థ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి సైతం ఆరు నెలలుగా జీతాలు లేవు. ఈ కారణంగా పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది రోగులను వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్లపై తీసుకెళ్లేందుకు డబ్బు డిమాండ్ చేస్తుండటం తరచూ గొడవలకు కారణమవుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement