ఈ ఫొటోలో కనిపిసున్న బాలింత తిప్పరి సునీత. ఈమెది కరీంనగర్‌లోని వావిలాలపల్లి. రెండో కాన్పు కోసం ఈనెల 16న కరీంనగర్ ప్రభుత్వాసుత్రిలో చేరింది. 18న శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మగబిడ్డకు పురుడుపోశారు. కుట్లు వేసే సమయంలో విచక్షణ కోల్పోయినట్లున్నారు. కోసిన భాగంలో బొంతకన్నా దారుణంగా అటుఇటు కలిపి రెండుకుట్లు మాత్రమే వేశారు. కుట్లు వేసిన రెండోరోజు మాత్రమే డాక్టర్ పరీక్షించి వెళ్లింది. అనంతరం ఆమెను పట్టించుకున్నవారు లేరు. గురువారం ఉదయం కుట్లు విప్పేందుకు సిబ్బంది సునీతను పరీక్షించగా.. కడుపంతా వాచిపోయింది.
కుట్లు వేసిన భాగమంతా పుండుగా మారింది. తీవ్ర అవస్థతతో బాధపడుతున్న ఆమెకు పుండుమీద కారం చల్లినట్లు.. తిరిగి మరో ఆరు కుట్లు వేశారు. అవి కూడా అడ్డదిడ్డంగా వేయడంతో సునీత బాధ వర్ణణాతీతం. ప్రస్తుతం ఆ కుట్లు కూడా ఎండకపోవడంతో సెప్టిక్ అయి నరకయాతన పడుతోంది. కడుపునొప్పితో బాధపడుతోందని, తలతిప్పుతోందని బాధితురాలి అత్త లక్ష్మి సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే.. శరీరాలను బట్టి ఒక్కోసారి ఇలాగే జరుగుతుందంటూ లెక్చర్ ఇవ్వడం గమనార్హం.
-న్యూస్‌లైన్, కరీంనగర్ హెల్త్