పశు వైద్యానికి పాతర! | Government ignoring Veterinary medicine Education | Sakshi
Sakshi News home page

పశు వైద్యానికి పాతర!

Published Thu, Dec 19 2013 11:43 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

పశు వైద్యానికి పాతర! - Sakshi

పశు వైద్యానికి పాతర!

దేశంలో పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో భాగంగా ఉన్న పశు వైద్య విద్య కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకుంటుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా ఉన్న పశువైద్య విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కలిపేసే నిర్ణ యం తీసుకుంది. పశు వైద్య పరిశోధనలకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు కృషి చేయ కుండా ఉన్న యూనివర్సిటీల రూపురేఖలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క పశు వైద్య విద్యకే కాకుండా వ్యవసాయ, అనుబంధరంగాల విద్య, పరిశోధనల తిరోగమనానికి దారితీస్తుంది.
 
 రాష్ట్రంలో రాజేంద్రనగర్ కేంద్రంగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, రామన్నగూడెం కేంద్రంగా డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం, తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యా లయాలు ఉన్నాయి. వీటిని ‘ఇంటిగ్రేటెడ్’ విశ్వవిద్యాలయాలుగా మారు స్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రాంతాల వారీగా కోస్తాంధ్రకు వెంకటరామన్నగూడెం విశ్వవిద్యాలయం, రాయలసీమకు తిరుపతి విశ్వవిద్యాలయం, తెలంగాణకు రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయం ఉంటాయి. ఒక్కో విశ్వవిద్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విద్య లను కలిపేసి ‘ఇంటిగ్రేటెడ్’ యూనివర్సిటీలుగా వీటిని ఏర్పరుస్తున్నారు. ఈ నిర్ణయం పశువైద్య విద్యకు ఎంత ప్రతిబంధకమవుతుందో అర్థం చేసుకోవా లంటే కొంత చరిత్రలోకి వెళ్లాలి. గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్భాగంగా ఉన్న పశు వైద్య విద్యను విడదీయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయో చూడాలి. 
 
 ఎందుకీ విభజన?
 రాష్ట్రంలో 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 1996లో దీనికే ఎన్జీ రంగా పేరు పెట్టారు. పశువైద్య విద్యతో పాటు ఇతర అనుబంధ రంగాల విద్య కూడా రంగా యూనివర్సిటీ పరిధిలోనే ఉండేది. ఈ నేపథ్యంలో పశు పరిశోధన దారుణ నిర్లక్ష్యానికి గురైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ఒం గోలు జాతి పశువులు స్థానికంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. నెల్లూరు, దక్కనీ తదితర స్థానిక జాతుల గొర్రెలపై పరిశోధనలు లేవు. దేశవాళీ పాడి పశువులతో అధిక పాల సార ఉన్న విదేశీ జాతులతో సంకరపరిచే ప్రయోగాలూ అటకెక్కాయి. వేల కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతంతో అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్న మత్స్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎంత కృషి చేసినా 4-5 శాతం వృద్ధిరేటు దాటని వ్యవసాయ రంగంపైనే కేంద్రీకరించి, వృద్ధి రేటు 8-10 శాతం నమోదు చేసుకుంటున్న పాడి, పశుపోషణ రంగాల్లో పరిశోధనలు నిర్లక్ష్యానికి గురవుతున్న వైనంపై మేధావుల్లో అంతర్మథనం మొదలైంది. 
 
 అవసరాన్ని గుర్తించిన వైఎస్
 ఈ సంధి దశలోనే 1989లో తమిళనాడులో, 1995లో పశ్చిమబెంగాల్‌లో, 1998లో మహారాష్ట్రలోను ఇలా దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా పశు వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు 1994 నుంచి మొదల య్యాయి. 2003లో ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఈ వ్యాసకర్త కూడా సభ్యుడే. మేం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో ఏర్పాటైన పశు వైద్య విశ్వ విద్యాలయాలను సందర్శించాం. వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో, పశుసంవర్థక శాఖాధిపతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం రా్రష్టంలో పశు వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్య కతను తెలుపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆయన దృష్టికి మా ప్రతిపాదన పోయింది. ఆయన మరింత దూరదృష్టితో ఆలోచించి పశు వైద్యానికే కాదు, ఉద్యాన శాఖకు కూడా ప్రత్యేక విశ్వవిద్యా లయం ఉండాలని భావించారు. ఆ రకంగా రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య కళాశాలల అంకురార్పణ జరిగింది.
 
 తిరోగామి చర్య
 పశువైద్య పరిశోధనారంగానికి సంబంధించినంతవరకూ తిరోగామి చర్యే. ఒక్క పశువుల మేత సాగుకు సంబంధించి తప్ప మిగతా ఏ అంశానికి సంబంధించిన వ్యవహారాలతో వ్యవసాయ విద్యకు సంబంధం ఉండదు. పశువుల జబ్బులు, టీకాలు, మేలుజాతి పశువుల ఉత్పత్తి వగైరా ఏ అశంలోనూ సంబంధంలేని వ్యవసాయంలో పశు వైద్యాన్ని కలిపేయడం అనాలోచిత, అసంబద్ధ చర్యే. మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలనో.. రాష్ట్ర విభజన నేపథ్యమో.. కార ణాలు ఏమైనా ఈ చర్య పశు వైద్య పరిశోధనా రంగాన్ని మసకబారుస్తుంది. ఇందుకు బదులుగా ప్రభుత్వం మరిన్ని కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చొరవచూపి ఉంటే బాగుండేది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రెండేసి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పెపైచ్చు ఈ రాష్ట్రాలన్నింటీలోనూ పశు వైద్యానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలూ ఉన్నాయి. ఎంతో విస్తృతి ఉన్న మన రాష్ట్రంలో మాత్రం ఒకే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులిచ్చే ‘భారత వ్యవసాయ పరిశోధనా మండలి’ (ఐసీఏఆర్) తన నిధులను విశ్వవిద్యాలయాల వారీగా పంచుతుంది. ఆ రకంగా చూసినప్పుడు నాలుగు విశ్వవిద్యాలయాలున్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అందుతాయి. 
 
 పశు వైద్యుల కొరత
 ఇటీవల పశుసంవర్ధక శాఖ 400 పశువైద్యుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైనవారు సగం మందే లభించారు. ఇంకా సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రొద్దుటూరు, కోరుట్ల పశువైద్య కళాశాలల్లో తగినంత మంది బోధనా సిబ్బంది లేరన్న కారణంగా ఇటీవల వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ కాలేజీల అనుమతి రద్దుకు ప్రతిపా దించింది. దీంతో యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వమూ బోధనా సిబ్బంది ఖాళీలను పూరించడానికి పూనుకుంది. వెటర్నరీలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దొరకడమే గగనమైంది. చివరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో పీజీ పూర్తయిన ఉద్యోగులను పదుల సంఖ్యలో డెప్యుటేషన్‌పై ఆ కాలేజీల్లో నియమించాల్సివచ్చింది. రాష్ట్రంలో పశువైద్యుల కొరతను వివరించేందుకు ఈ రెండు ఉదాహరణలు చాలు. పౌల్ట్రీ, డెయిరీ తదితర రంగాలు వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటురంగంలో కూడా పశువైద్యుల కొరత చాలా ఉంది. ఈ నేపథ్యంలో పశువైద్య విద్యపై మరింతగా కేంద్రీకరించి నిపుణులను తయారు చేసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధచూపాల్సి ఉంది. అందుకోసం రాష్ట్రంలో ఇప్పుడున్న ఐదు కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడంతోపాటు, అదనపు కాలేజీల ఏర్పాటుకు కృషిచేయాల్సి ఉంది. కొత్తగా పశువైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాక పశువైద్య కాలేజీల సంఖ్య మూడు నుంచి ఐదుకు పెరిగింది. కొత్తగా రెండు డెయిరీ కళాశాలలు, ఐదు పశు పరిశోధనా కేంద్రాలు, రెండు మత్స్య పరిశోధనా కేంద్రాలు, మూడు పశు సంవర్ధక పాలిటెక్నిక్ కాలేజీలు, ఒక మత్స్య పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాట య్యాయి. ఈ కృషి మరింత పెరగాల్సిన సమయంలో ‘ఇంటిగ్రేటెడ్’ విశ్వ విద్యాలయాల పేరుతో ఉన్న పశు వైద్య విశ్వవిద్యాలయం రద్దుకు పూను కోవడం పశు వైద్య రంగానికి సంబంధించినంత వరకూ పూర్తిగా తిరోగమన చర్యే.
 
 కొత్తగా ఏం చేయాలి?
 రాష్ట్ర విభజన జరిగినా.. జరగక పోయినా బాపట్ల, తిరుపతిలో రెండు వ్యవ సాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఉన్న పశువైద్య విశ్వవిద్యాలయాన్ని అలాగే కొనసాగిస్తూ అదనంగా రాజేంద్ర నగర్, గన్నవరాలలో రెండు పశువైద్య విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలి. వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని అలాగే కొనసాగిస్తూ రాజేంద్రనగర్, అనంతరాజుపేటల్లో ప్రత్యేక ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. అప్పుడు రాష్ట్రం విడిపోయినా, విడిపోకున్నా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఒక్కో ప్రాంతానికి మూడు వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినట్లవుతుంది. వీటికి తోడు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్య్స కళాశాల ఉన్న చోట మత్య్స విశ్వవిద్యాలయాన్ని నెలకొ ల్పాలి. ఉన్నత విద్యకు సంబంధించి జిల్లాకో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో నూటికి 70 మందికి జీవనాధారమైన వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి 23 జిల్లాలకు తొమ్మిది విశ్వవిద్యాలయాల ఏర్పాటు సమర్థనీయమే. అప్పుడు మాత్రమే జీడీపీలో 8-10 శాతం వృద్ధి ఉన్న పశు సంవర్థక రంగానికి న్యాయం చేసినట్లవుతుంది.
 
(వ్యాసకర్త రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్,
 ‘పశునేస్తం’ మాస పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)
 ఒక్క పశువుల మేత సాగుకు సంబంధించి 
 తప్ప మిగతా ఏ అంశానికి సంబంధించిన వ్యవహారాలతో వ్యవసాయ విద్యకు సంబంధం ఉండదు. పశువుల జబ్బులు, టీకాలు, మేలుజాతి పశువుల ఉత్పత్తి వగైరా ఏ అశంలోనూ సంబంధంలేని వ్యవసాయంలో పశువైద్యాన్ని కలిపేయడం అనాలోచిత, అసంబద్ధ చర్యే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement