సీఎం కిరణ్పై సమైక్యవాదుల మండిపాటు
తిరుపతి : ఓవైపు ఢిల్లీలో రాష్ట్ర విభజనపై వేగంగా పావులు కదులుతుంటే - ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం శుభకార్యాలకు, దేవాలయాల చుట్టు తిరుగుతున్నారని సమైక్యవాదులు మండిపడుతున్నారు. విభజన కీలక సమయంలో చిత్తురు జిల్లాలోని ఓ వివాహ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడాన్ని వారు తప్పుబట్టారు.
పీలేరుకు చెందిన కాంగ్రెస్ నేత కుమార్తె వివాహానికి కిరణ్ గురువారం తిరుపతికి విచ్చేశారు. తర్వాత ఆయన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వెలుపలికి వస్తుండగా కొంతమంది భక్తులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం మాత్రం స్పందించకుండా వెళ్లిపోయారు.
ఇక సీఎం తిరుపతి పర్యటన సందర్భంగా కొంతమంది పార్టీ కార్యకర్తలు మాత్రమే రేణుగుంట విమానాశ్రయం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు నేతలు డుమ్మా కొట్టారు. తిరుపతి పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి హైదరాబాద్ బయల్దేరారు.