రూ.500 కోట్ల భూకుంభకోణం..
రాజకీయ ఊసరవెల్లిగా ప్రసిద్ధికెక్కిన ఓ మాజీ ఎమ్మెల్యే పక్కా ప్రణాళికతో రూ.500 కోట్ల విలువైన చెరువు భూములను కాజేశారు. కిరణ్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే 36 ఎకరాల చెరువు భూమిని కొట్టేయడానికి ఉత్తర్వులు జారీ చేయించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే సైకిలెక్కి.. చంద్రబాబు పంచన చేరారు.
నాడు కిరణ్ సర్కారు జారీచేసిన ఉత్తర్వులను.. నేడు చంద్రబాబు జమానాలో అమలు చేయించుకున్నారు. ఉన్నత స్థాయి ఒత్తిళ్లు..ముడుపులకు తలొగ్గిన రెవెన్యూ అధికారులు ఏకంగా రికార్డులనే ఫోర్జరీ చేసి ఇప్పటికే 17.18 ఎకరాలను ఆ మాజీ ఎమ్మెల్యే అనుయాయుల సొంతం చేశారు. నేడు మరో 18.82 ఎకరాలను ఆ మాజీ ఎమ్మెల్యే బంధువుల పరం చేయడానికి ఉత్తర్వులు జారీచేయనున్నారు. రూ.500 కోట్ల విలువైన ఈ భూకుంభకోణానికి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి వేదికైంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి రూరల్ మండలం అవిలాలలో సర్వే నెంబరు 370లో 6.76 ఎకరాలు, 376లో 12.40 ఎకరాలు, 377లో 17.18 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 370 సర్వే నెంబరులోని భూమి కాలవ పోరంబోకు, 376, 377 సర్వే నెంబర్ల పరిధిలోని భూమి ఓటేరు చెరువు శిఖం భూమిగా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువు, చెరువు శిఖం, కాలవ పోరంబోకు భూములను ఎవరికీ కేటాయించకూడదు.
చెరువులు, కాలువలను ఆక్రమిస్తే.. క్రిమినల్ కేసులు పెట్టాలని సుప్రీం కోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. తిరుపతికి 4 కిమీల దూరంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆ భూమి విలువ ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఆ భూమిపై ఒకటిన్నర దశాబ్దం క్రితమే మాజీ ఎమ్మెల్యే కళ్లు పడ్డాయి. రూ.500 కోట్లకుపైగా విలువ చేసే ఆ భూమిని సొంతం చేసుకోవడానికి ఆయన పెద్ద కథనే అల్లారు.
కట్టు కథకు రెవెన్యూ తందానా..
సర్వే నెంబరు 370, 376, 377 పరిధిలోని భూమిని 1933లో తిరుమలశెట్టి రాధాకృష్ణయ్య శెట్టి మద్రాసుకు చెందిన కృష్ణయ్య శెట్టియార్‌కు విక్రయించారని.. కృష్ణయ్య శెట్టియార్ శిస్తులు కట్టకపోవడంతో జిల్లా మున్సిఫ్ కోర్టు ఆగస్టు 30, 1936లో వేలం వేసిందని.. ఆ వేలంలో రాఘవదాస్ బావాజీ కొనుగోలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే కట్టుకథ అల్లారు. అనంతరం ఆ భూమిని రాఘవదాస్ బావాజీ ఆయన కుమారుడైన రామానందశర్మ పేరుతో డిసెంబర్ 12, 1949న రిజిస్టర్ చేయించారంటూ నకిలీ రికార్డులు సృష్టించారు. రామానందశర్మ చనిపోవడానికి ముందు ఆ భూమిని బి.జయరామిరెడ్డి పేరిట వీలునామా రాసినట్లు సరి కొత్త డ్రామాకు తెరతీశారు.
ఆ భూమిని మాజీ ఎమ్మెల్యే తన అనుయాయులైన తొట్టంబేడు మండలం గుర్రప్పనాయుడు కండ్రిగ, తంగెళ్లపాలెంకు చెందిన డి.వెంకట్రామనాయుడు మరో 12 మందితో జయరామిరెడ్డి నుంచి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఆ భూమి సర్వహక్కులు పొందేందుకు జయరామిరెడ్డి ఎంతకూ తమ పేరుపై రిజిస్టర్ చేయించడం లేదని మాజీ ఎమ్మెల్యే అనుయాయులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు 1997లో తమ పేరుపై రిజిస్టర్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు పొంది.. రియల్ వెంచర్ వేసి సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతో కిరణ్‌కుమార్‌రెడ్డి పంచన చేరారు.
కిరణ్ సీఎంగా ఉన్నప్పుడే ఈ ఏడాది జనవరి 4న 370, 376, 377 సర్వే నెంబర్ల పరిధిలోని 36 ఎకరాల భూమికి డి.వెంకట్రామనాయుడు మరో 12మంది పేర్లపై పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని అప్పటి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డికి వినతిపత్రం ఇప్పించారు. అప్పటి సీఎం కిరణ్‌పై మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి జనవరి 10న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా ద్వారా చిత్తూరుజిల్లా కలెక్టర్ రాంగోపాల్‌కు ఉత్తర్వులు జారీచేయించారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతో మాజీ ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా సైకిలెక్కి.. చంద్రబాబు పంచన చేరారు.
రెవెన్యూ రికార్డులు తారుమారు
ప్రిన్సిపల్‌సెక్రటరీ ఉత్తర్వులతో మాజీ ఎమ్మెల్యే అప్రమత్తమయ్యారు. నోట్ల కట్టలను వెదజల్లి.. అధికారులను లొంగదీసుకున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం 1886లో తొలిసారిగా భూములను సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం 370 సర్వే నెంబరు పరిధిలోని 6.76 ఎకరాలు కాల్వ పోరంబోకుగానూ.. 376లోని 12.40 ఎకరాలు ఓటేరు చెరువు శిఖం భూమిగానూ.. 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం భూమిగానూ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఏ-రిజిస్టర్‌లో ఇప్పటికీ ఇదే సమాచారం ఉంది. కానీ.. బ్రిటీష్ ప్రభుత్వం 1916లో మరోసారి భూములను సర్వే చేయించింది. అప్పుడు సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి ప్రభుత్వ బంజరుగా పేర్కొంది. ఇంతలోనే చంద్రగిరి సబ్ కలెక్టర్ మేల్కొని 1925లో రీ-సర్వే చేయించి.. 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమిని చెరువు శిఖంగానే పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఈ మూడు సర్వే నెంబర్ల పరిధిలోని భూమి ఎవరి పేరిటా లేకపోవడం గమనార్హం.
కానీ.. ఇవేవీ పట్టించుకోలేదు. 1916 సర్వేను పరిగణనలోకి తీసుకున్న అధికారులు సర్వే నెంబరు 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమిని వెంకట్రామనాయుడు మరో 12 మంది పేర్లపై పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్ జారీచేయాలని జూన్ 18న కలెక్టర్ రాంగోపాల్ ఆదేశించారు. తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి, తహశీల్దార్ యుగంధర్ కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే 377 పరిధిలోని 17.18 ఎకరాల భూమి చెరువు శిఖం, వాగు పోరంబోకు భూమి కాదని తేల్చి జూలై 12న వెంకట్రామనాయుడు మరో 12 మంది పరం చేశారు. ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేశారు. కానీ.. ఈ భూమి చెరువు శిఖం భూమి. ఇదే భూమిలో యానాదికాలనీ ప్రభుత్వ పాఠశాల భవనం ఉండటం గమనార్హం. ఇదే రీతిలో 376, 370 పరిధిలోని 18.82 ఎకరాల భూమిని కూడా మాజీ ఎమ్మెల్యే అనుయాయుల పరం చేస్తూ నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.