అవి చూసేందుకు గుట్టలే. తాజాగా దాని విలువ పెరిగింది. ప్రభుత్వ భూమైనా స్థానికులు కొందరు సాగుచేస్తుండడంతో వారికి పట్టాలిచ్చారు. మరి కొంతమందికి ఇప్పుడు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పలుకుబడి దార్లు తమ బినామీలను రంగంలోకి దించి దాన్ని కాజేయాలని చూస్తున్నారు. ఇదీ అలంపూర్ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన వందెకరాల భూమి కథ.
అలంపూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ స్థలాలపై బినామీల కన్నుపడింది. నియోజకవర్గ నేత అనుచరులు అధికారులను మచ్చిక చేసుకొని బినామీ పేర్లతో భూమిని స్వాహా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక అధికారి సైతం సొంత లాభం ఆర్జిస్తూ.. బినామీలకు పూర్తి స్థాయి అండదండలు అందిస్తూ...అర్హులకు మొండి చేయి చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పొలాలకు పట్టా వస్తుందని అశించిన నిరుపేదలు ఈ విషయం తెలిసి అందోళన చెందుతున్నారు. బినామీల చేతికి అందుతున్న తమ పొలాలను దక్కించుకోవడానికి జిల్లా ఉన్నత అధికారుల చూట్టు చక్కర్లు కొడుతున్నారు. అలంపూర్ మండల పరిధిలోని ర్యాలంపాడు గ్రామం జిల్లాకు సరిహద్దులో ఉంది. అంతేకాక తుంగభద్ర నదికి అవతలి వైపున ఉన్న మూడు గ్రామాల్లో ఇదొకటి. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన మూడు సర్వే నెంబర్‌లలో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
ఇందులోని కొంత భాగాన్ని దశాబ్దాలుగా కొన్ని నిరుపేద కుటుంబాలు బంజరు భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చుకొని సాగు చేస్తున్నారు. వీరిలో కొంత మందికి పట్టాలు రాగా మరి కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారి జాబితా సిద్దమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న బినామీలు ఒక అధికారిని దారిలోకి తెచ్చుకొని అర్హులైన నిరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రణాళిక వేసినట్లు భోగట్టా. ఈ మేరకు ఎకరాకు కొంత మొత్తం ముట్టజెప్పుకొని పట్టాల పంపిణీ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు పూర్తి స్థాయి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డిమాండ్ రావడంతోనే :
తుంగభద్ర నది అవతలి పొలాలకు గతంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. అయితే అలంపూర్-ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు మరో ఏడాదిలో పూర్తయి రాకపోకలు సాగే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని పొలాల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు సైతం రోడ్డుకు అతిసమీపంలో ఉండటంతో భవిష్యత్తులో వాటికి మంచి ధర వస్తుందని బినామీలు అందిన కాడికి వాటిని కాజేసే యత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ర్యాలంపాడు గ్రామస్తులు గతంలోనే ఓసారి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు స్పందించి అర్హులకు న్యాయం జరిగే విధంగా చూడాలిన కోరుతున్నారు.
తహశీల్దార్ ఏమన్నారంటే...
ప్రభుత్వ భూ పంపిణీకి స్థలాన్ని పరిశీలించమని చెప్పడంతో ర్యాలంపాడు, ఉట్కూరు గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ యోగ్యమైన పొలాలను గుర్తించాం. అర్హుల పేర్లు గుర్తిస్తున్నాం. ఇంకా జాబితా పూర్తి స్థాయిలో ఎంపిక చేయలేదు. సిద్దం చేసిన అనంతరం అసైన్డు కమిటీలో చర్చించి అర్హుల జాబితాను ప్రకటిస్తాం. అనఅర్హులకు అస్కారం లేకుండా జాగ్రత్తలు తీసకుంటాం.
గుట్టలు..గుటకలు
Published Fri, Jan 24 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement
Advertisement