ఆక్రమించిన ప్రభుత్వ భూములను ఎలాగో అమ్మేశాం, ఇక మనల్ని అడిగేదెవరూ.. అని కొందరు టీడీపీ నేతలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. ఆ భూములను అమ్మిపెట్టిన దళారులైతే మన కమీషన్
మనకొచ్చేసింది.. మనల్ని అడిగేదెవరు అనుకున్నారు. అయితే ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపుపై కలెక్టర్ రేవు ముత్యాలరాజు పట్టుదలగా ఉండడంతో పచ్చ నేతల్లో గుబులు నెలకొంది.
సాక్షి, ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి) : భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అనేక సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయి. టీడీపీ ప్రజాప్రతినిధులే రాబందుల్లా వాటిని కాజేశారు. వాటిలో ఒకటి ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీ. ఇక్కడ గత టీడీపీ ఎమ్మెల్యే పేరుతో జరిగిన భూవిక్రయాల బాగోతం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారంతా ఆందోళనకు గురవుతున్నారు. గుండెల్లో ‘భూ’కంపం రేగినట్టు బాధను మింగలేక, బయటకు కక్కలేక సతమతమవుతున్నారు. జిల్లా యంత్రాంగం తాడేపల్లిగూడెంలోని దేవదాయ శాఖ భూముల్లో ఆక్రమణల తొలగింపు చేపడుతున్న నేపథ్యంలో ద్వారకాతిరుమల టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది.
అసలేం జరిగిందంటే..
ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీ వద్ద ఆర్‌ఎస్ నంబర్ 11, 1/2లోని ఎంతో విలువైన ప్రభుత్వ కొండ పోరంబోకు భూమిని టీడీపీ నేతలు కొందరు దళారుల చేత విక్రయించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు సంబంధించిందంటూ అప్పట్లో దాదాపు 26 సెంట్లు భూమిని కొందరు ధనికులకు, లక్షలాది రూపాయలకు అమ్మేశారు. ఈ భూబాగోతాలపై ‘సాక్షి’ గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో భూమిని విక్రయించిన టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇక కొనుగోలు చేసిన వారికైతే ముచ్చెమటలు పట్టాయి. ఈ క్రమంలోనే ‘సాక్షి’ కథనాలపై స్పందించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావును విచారణకు ఆదేశించారు. దీంతో ఆయన గతేడాది సెప్టెంబరు 20న స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను, వివాదాస్పద భూమిని పరిశీలించి అవకతవకలను గుర్తించారు.
అలాగే భూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ప్రస్తుత గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అప్పట్లో పార్టీ నేతలతో కలిసి, వివాదాస్పద ప్రభుత్వ భూమిని పేదలకు అందేలా చూడాలని ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. దీంతో విక్రయానికి గురైన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ చక్రధరరావు తహసీల్దార్‌ను ఆదేశించారు. కానీ ఆదేశాలు భేఖాతరవడంతో కొనుగోలుదారులు ప్రభుత్వ భూమిలో బేస్ మెంట్లు వేసి, దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. ఈ భూబాగోతాలపై స్థానికులు కొందరు గత జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయింది.
అధికారులు దృష్టిపెట్టేనా!
విక్రయాలకు గురైన ప్రభుత్వ భూమి పేదలకు చెందాలని పోరాడిన వైఎస్సార్ సీపీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో పాటు, జిల్లా అధికారులు భూ ఆక్రమణలపై దూకుడు పెంచడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తొమ్మిది నెలలుగా విచారణ పేరుతో మూలనపడి ఉన్న ఫైల్ బయటకు వస్తుందేమోనని బిక్కుబిక్కు మంటున్నారు. ఒకవేళ ఆక్రమణలను తొలగించే పరిస్థితే గనుక ఎదురైతే తమ పరిస్థితి ఏమిటా అని వారు తర్జనభర్జన పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి, వాటిని నిరుపేదలకు అందించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment