
'ప్రైవేటు బస్సుల దూకుడుకు కళ్లెం వేయాలి'
హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు బస్సుల దూకుడుకు కళ్లెం వేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సుల ఆగడాలను వెంటనే నియంత్రించాలని అన్నారు. రోడ్డుప్రమాదాలు, ప్రైవేట్ బస్సుల ఆగడాలపై సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒకే నంబరుపై 4 బస్సులు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. చట్టవిరుద్దంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నియంత్రించలేకపోతే తాము కల్పించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒకపక్క ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రైవేటు బస్సుల నియంత్రణ విషయంలో ప్రభుత్వ అధికారుల స్పందన సరిగా లేదని నారాయణ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.