ఆర్టీసీ అప్పులు మాఫీ చేయాలి
Published Mon, Aug 26 2013 4:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
హుస్నాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం మాఫీ చేయాలని టీఎంయూ రాష్ర్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు థామస్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ నష్టాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంతో టీఎంయూ అనేకసార్లు చర్చలు జరిపిందన్నారు. ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలతోనే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రూ.500 కోట్ల అప్పులతో ఆర్టీసీ బతికి కట్టే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సాలీన రూ.1500 కోట్ల డిజిల్ పన్నుల రూపేణా ఆర్టీసీ చెల్లించాల్సి ఉంటుందని, వీటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. సీమాంధ్రలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయూస్ యూనియన్లు సమైక్యవాదం కోసం చేస్తున్న సమ్మెను విరమించకపోతే ఆర్టీసీ నష్టపోతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలోని ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టారని, రెండు ప్రాంతాలు విడిపోయినప్పుడు ఆస్తులు ఎవరివి వారికి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేవంలో టీఎంయూ నాయకులు ప్రభాకర్, బుచ్చయ్య, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపీరెడ్డి, రాములు, మల్లయ్య, నారాయణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement