ఆరేళ్లుగా చీకటి కొట్టులో...
భార్యకు నరకం చూపిన ఘనుడు
నిందితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కోటవురట్ల, న్యూస్‌లైన్: సమాజానికి మంచిని బోధించే ఉపాధ్యాయుడతను. మంచి నడతతో నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన గురుస్థానాన్ని అధిష్టించాడు. అయినా ఏం లాభం? భార్యకు ఇలలోనే నరకం చూపాడు.. కష్టసుఖాల్లో తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన ఆ ప్రబుద్ధుడు కట్టుకున్న ఇల్లాలికి పెళ్లయింది మొదలు 22 ఏళ్లుగా దుర్భర జీవితాన్ని ప్రసాదించాడు. దీనికి పరాకాష్టగా ఆరేళ్లుగా భార్యను చీకటి కొట్టులో పెట్టి ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు. విశాఖజిల్లా కోటవురట్లకు చెందిన పీవీఎస్‌జే ప్రసాద్(50) పెదబొడ్డేపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి కాకినాడకు చెందిన నాగమల్లేశ్వరి(43)తో 1991లో వివాహమైంది. పెళ్లయిన నాటినుంచే భార్యను తీవ్ర వేధింపులకు గురిచేశాడు.
పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్ చేసినా మార్పు రాలేదు సరికదా.. శాడిజం మరింత పెరిగింది. భార్యను చిన్నకొట్టు గదిలో నిర్బంధించాడు. భోజనం నిమిత్తం నెలకు ఐదు కిలోల బియ్యం మాత్రమే కొలిచి ఇచ్చేవాడు. ఆ గదిలోనే ఆమె ఉంటూ గంజి మెతుకులతో నెట్టుకొస్తోంది. చీకటి గదిలో దోమలతో ఖైదీ కంటే దుర్భరమైన జీవితాన్ని గడిపింది. స్థానికుల ఫిర్యాదుతో ఐద్వా మహిళలు పోలీసులతో శుక్రవారం రంగప్రవేశం చేశారు. గదిలో ఉన్న ఆమెను కోటవురట్ల ఇన్‌చార్జి ఎస్‌ఐ బి.రోహిణీపతి విచారించగా పై విషయాలన్నీ బయటపడ్డాయి. భర్తతో 22 ఏళ్లుగా తనకు ఎలాంటి సంబంధంలేదని, బాహ్యప్రపంచంతో సంబంధం లేదని బాధితురాలు తెలిపింది. మూడేళ్ల క్రితం ఆడపడుచు అలివేలు మంగతాయారు భర్త చనిపోవడంతో ఆమె కూడా ఈ ఇంట్లోనే నివాసముంటోందని, తనకు అత్త, ఆడపడుచుల వేధింపులు మరింత ఎక్కువయ్యాయని బాధితురాలు తెలిపింది. నడవలేని స్థితిలో.. చిరిగిన నైటీతో ఉన్న ఆమెకు చీర కట్టించి బయటకు తీసుకువచ్చారు. చాలా నీరసంగా ఉన్న బాధితురాలిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేరుస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.