మాకెందుకు మాఫీ కాలేదు | Government to reflect on the nature of the peasantry | Sakshi
Sakshi News home page

మాకెందుకు మాఫీ కాలేదు

Published Tue, Apr 7 2015 3:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రుణమాఫీ వర్తించకపోవటంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు సోమవారం హైదరాబాద్‌లో సచివాలయం ఎల్ బ్లాక్ 5వ అంతస్తులో ఇలా ఫిర్యాదుల విభాగం ఎదుట - Sakshi

రుణమాఫీ వర్తించకపోవటంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు సోమవారం హైదరాబాద్‌లో సచివాలయం ఎల్ బ్లాక్ 5వ అంతస్తులో ఇలా ఫిర్యాదుల విభాగం ఎదుట

సర్కారు తీరుపై మండిపడ్డ రైతాంగం
 
హైదరాబాద్: రైతాంగాన్ని రుణ విముక్తులను చేశామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వానికి సెగ తగిలింది. మీరంటున్న రుణ మాఫీ ఎక్కడైందో చెప్పాలంటూ రైతులంతా ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘మేమంతా రైతులమే... మా రుణాలెందుకు మాఫీ కాలేదో తేల్చాలి? మీరిక్కడ కూర్చొని మాఫీ అయిపోయిందంటే సరిపోతుందా...? మీు రుణాలు మాఫీ కాలేదు... డబ్బు చెల్లించమంటూ బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. దానికి మీరిచ్చే సమాధానమేంటి? ఎన్నికలకు ముందు మీరిచ్చిన హామీ ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నదేంటి? ఎందుకు మభ్యపెడుతున్నారు’ అంటూ రైతులు నిలదీశారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు... ఏకంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రైతులు అధికారులను గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలివి. రకరకాల సాకులతో రుణ మాఫీ జాబితాలో లేకుండా చేసి అందరికీ మాఫీ అయిందంటారా? ఇవిగో మా పత్రాలు. చూసి చెప్పండి’ అని సచివాలయానికి చేరుకున్న రైతులు ఒక్కసారిగా నిలదీయడంతో బిత్తరపోవడం అధికారుల వంతైంది. వందలాదిగా రైతులు సోమవారం నేరుగా రాష్ట్ర సచివాలయం చేరుకుని అధికారులపై పరంపరంగా ప్రశ్నలు సంధించారు.

రుణాలన్నీ మాఫీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడికెళ్లినా పదేపదే చెబుతున్న నేపథ్యంలో నిగ్గు తేల్చడానికి  సచివాలయానికి వచ్చారు. వీరిని భద్రతా సిబ్బంది తొలుత సచివాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదు. అడుగడుగునా అడ్డుతగిలారు. రైతులని కూడా చూడకుండా వారిని ముప్పుతిప్పలు పెట్టి ఆ తర్వాత అనుమతించారు. సచివాలయంలోని ఎల్ బ్లాకులోగల ఐదో అంతస్తులోగల ప్రణాళికా విభాగంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు చేరుకున్న రైతులు రుణ మాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. వెంట తెచ్చుకున్న పత్రాలను చూపించి ఎందుకు మాఫీ కాలేదో నమోదు చేసుకుని చెప్పాలని నిలదీశారు. రేషన్ కార్డులు అడిగినప్పుడు వాటిని సమర్పిస్తే అసలు రేషన్ కార్డే తప్పుందంటూ బ్యాంకులు తిరస్కరించాయని మొరపెట్టుకున్నారు. రుణాల మాఫీ సంగతి దేవుడెరుగు... నేరుగా హైదరాబాద్ వచ్చి తమ మాఫీ సంగతేమిటని ఫిర్యాదు చేయడానికొచ్చిన తాము అందజేసిన వినతిపత్రాలను కూడా అధికారులు తిరస్కరించడంపై రైతులంతా ఒక ్కసారిగా భగ్గుమన్నారు. ఇంతదూరం వచ్చింది దేనికోసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో పడిగాపులు కాసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎట్టకేలకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలసి మొరపెట్టుకున్నారు. 

నిబంధనల కారణంగా రుణ మాఫీకి మీరు అర్హులు కారని చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. రుణాలు చెల్లించొద్దంటూ ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడేమో సవాలక్ష నిబంధనలు పెట్టి మాఫీకి అర్హులు కారని చెప్పడమేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయం వచ్చి గోడువెళ్లబోసుకున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో కొందరు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బంగారు నగలను వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు ఇచ్చాయని కలిసిన వారందరికీ మొరపెట్టుకున్నారు. డ్వాక్రా లింకేజీ రుణాల మంజూరుకు కూడా వ్యవసాయ రుణాలు చెల్లించాలని బ్యాంకు మేనేజర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పదుల సంఖ్యలో వచ్చిన మహిళా రైతులకు కూడా సచివాలయంలో నిరాశే ఎదురైంది. తమ గోడు వెళ్లబోసుకుందామని జిల్లాల నుంచి ైసచివాలయం దాకా వచ్చి రోజంతా పడిగాపులు కాసినా ఫలితం లేకపోగా రైతుల విన్నపాలను ప్రభుత్వం తిరస్కరించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అధికారుల తీరుపట్ల ఆవేదన

సచివాలయానికి ఎన్నో ఆశలతో వచ్చిన రైతులు... అధికారుల తీరుతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. బ్యాంకులకు వెళితే రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, బంగారు నగలు వేలం ప్రకటనలు జారీ చేస్తున్నారంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన పలువురు మహిళా రైతులు కూడా సర్కారు తీరుపై మండిపడ్డారు. డ్వాక్రా లింకేజీ రుణాల మంజూరుకు కూడా వ్యవసాయ రుణాలు చెల్లించాలని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారన్నారు. బ్యాంకులు వ్యవసాయ రుణాల్ని బంగారు రుణాలుగా పేర్కొంటున్నాయని, ఇటు ప్రభుత్వం కూడా బంగారు రుణాలను చెల్లించాంటూ ఆదేశాలు ఇవ్వడం వల్లే బ్యాంకులు ఈవిధంగా చేస్తున్నాయంటున్నారు. అంతేకాకుండా తమ రుణాల్ని బ్యాంకర్లు ఉద్యాన పంటల కింద తీసుకున్న రుణాలుగా మార్చారని వారు ఆరోపిస్తున్నారు.
 
కొసరుకే సరిపోని బాబు అసలు కేటాయింపులు

సీఎం అయ్యాక చంద్రబాబు అధ్యక్షతన 30 జూన్, 2014 రోజున 184వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో (31 మార్చి, 2014 నాటికి) ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లుఆర్నెల్ల్ల తర్వాత అంటే  30 సెప్టెంబర్ 2014 నాటికి  తడిసిమోపెడై అవి రూ.99,555 కోట్లకు చేరుకున్నాయి.రుణాలు రెన్యూవల్ చేసుకోకపోవడం వల్ల సున్నా వడ్డీ, పావలా వడ్డీ దక్కలేదు. పైగా 14 శాతం అపరాధ వడ్డీ రైతులపై పడింది. తద్వారా 31 మార్చి 2014 నాటికి రూ.87,612 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 30 సెప్టెంబర్ 2014 నాటికి రూ.99,555 కోట్లకు చేరుకున్నాయి.రుణమాఫీ సకాలంలో చేయని కారణంగా వడ్డీ, అపరాధ వడ్డీ రూపేణా రైతులపై పడింది. ఇప్పటివరకు రైతులపై పడిన అదనపు భారం మొత్తం రూ. 13,937 కోట్లు  రుణ మాఫీ కోసమంటూ రెండు బడ్జెట్లలో రెండు విడతలుగా ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ. 6,840 కోట్లు మాత్రమే.
 
రేషన్  కార్డు చెల్లదన్నారు

రుణమాఫీకి ప్రభుత్వం సూచించిన అన్ని వివరాలూ అందజేశా. బ్యాంకుకు వెళితే రేషన్‌కార్డు చెల్లదని చెప్పారు. రూ. లక్షన్నర లోపు రుణం తీరుస్తామని ప్రకటిస్తే ఎంతో సంతోషపడ్డాం. నాకు రూ.లక్ష రుణం ఉంది. బ్యాంకులకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా  ఇబ్బందులకు గురిచేయడం దారుణం. ఇప్పుడు రుణమాఫీకి అర్హత లేదని చెబుతున్నారు.   
 - ఆకుల శివప్రసాద్, దేవనకొండ గ్రామం, కర్నూలు జిల్లా
 
ఇప్పుడేమి చేయాలో తోచడం లేదు


2013లో రెండెకరాల పొలం తనఖాపెట్టి రూ.98 వేలు అప్పు తీసుకున్నా. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అడిగిన అన్ని ఆధారాలు సమర్పించా. రెండో విడతలో పేరు లేకపోవడంతో అదేమని అడిగా. బంగారంపై రుణం తీసుకున్నట్టు పత్రాల్లో ఉందని, అందువల్ల ఏమీ చేయలేమని చెబుతున్నారు. అసలు నేను బంగారు నగలు తాకట్టు పెట్టి రుణమే తీసుకోలేదు.     - జూపల్లి రమేష్‌బాబు, తిరుపతి, చిత్తూరు జిల్లా
 
 గోల్డ్ లోన్‌గా మార్చడం వల్లే

 మాకున్న 2.41 ఎకరాల్ని తనఖా పెట్టి రూ.70 వేలు రుణం తీసుకున్నాం. వడ్డీతో రూ.90 వేలు అయ్యింది. విడతల వారీగా మొత్తం అప్పు పోతుందనుకున్నా. రెండో విడతలో పేరు లేదు. బ్యాంకుకు వెళితే బంగారు రుణమంటున్నారు.  ఫిర్యాదు చేసినా మేమేమీ చేయలేమంటున్నారు. బంగారు రుణాలను తీరుస్తామని హామీ ఇచ్చి ఇలా చేయడం భావ్యం కాదు.
 -తరిగొప్పుల వెంకట్రావు, బోడిపాలెం, పొన్నూరు, గుంటూరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement