రుణ మాఫీ అమలు విషయంలో ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. అన్నదాతలను ముప్పుతిప్పలు పెడుతోంది. అధికారం కోసం ఎన్నికలప్పుడు రుణమాఫీ అస్త్రాన్ని ప్రయోగించి ఇప్పుడు పంటరుణాలకే అంటూ నిబంధనల మాటున అర్హుల పేర్లను తొలి జాబితాలో లేకుండా చేసింది. అది కూడా ఇంటిలో ఒక్కరికే మాఫీ అని,రూ.1.5లక్షలకే పరిమితమని చెప్పుకొచ్చింది. ఆధార్‌కార్డు అంటూ మరికొందరిని తప్పించింది. రుణఅర్హత కార్డులు ఉండాల్సిందేనన్న మెలికతో కౌలు రైతులనూ తొలిగించింది. శుక్రవారం విడుదలైన అర్హుల జాబితాను చూసి చంద్రబాబు ఎంత మోసం చేశాడంటూ అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
⇒ రుణమాఫీలో అన్నదాతను ముంచిన ప్రభుత్వం
⇒ తొలిజాబితాలో కానరాని అర్హుల పేర్లు
⇒ నిబంధనల మాటున మోసం
⇒ పంట రుణాలకేనని మాటమార్చిన సర్కార్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో 3.77లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రూ.1094కోట్లు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. ఎన్నికలప్పుడు సీఎం చంద్రబాబు ప్రకటన ప్రకారం అందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. తొలి విడతగా రూ.50వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈమేరకు అర్హుల జాబితాను బ్యాంకర్లను కోరింది. వారి వివరాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో జాబితాను సరిచేసి పంపాల్సిందిగా మళ్లీ ఆదేశించింది. జిల్లాలో ఆ విధంగా తొలి విడతలో 80వేల అకౌంట్లు సమాచారాన్ని బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. దాని ప్రకారం రూ.50వేల నుంచి రూ.75 వేల వరకూ రుణం ఉన్న వారి పేర్లతో జాబితా విడుదలైంది. అందులో అర్హుల పేర్లు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
బ్యాంకులకు వెళ్లి అధికారులను నిలదీస్తున్నారు. బ్యాంకర్ల నుంచి సరైన సమాధానం రావడం లేదు. ఇది తొలి జాబితా అని, ఇందులో లేని పేర్లు రెండో జాబితాలో ఉండొచ్చని సర్దిచెబుతున్నారు. దీనిపై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి.జయబాబును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఇతర అధికారులను అడిగితే తమకేమీ తెలియదంటున్నారు. రుణమాఫీ వ్యవహారం గందరగోళంగా ఉందని, తాము ఏం మాట్లాడినా ఉద్యోగ పరంగా ఇబ్బందులని తప్పించుకుంటున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లాలో 46 బ్యాంకులకు చెందిన 623 శాఖల నుంచి రైతులు రుణాలు తీసుకున్నారు. అర్హుల జాబితాలను ఆయా శాఖలు ప్రభుత్వానికి అందజేశాయి. ఒక్కో శాఖలో 300 నుంచి 2000 మంది అర్హులపేర్లు మాత్రమే తొలి జాబితాలో ఉన్నాయి.పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేలా ‘గ్రీవెన్స్’ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రూ.75వేల లోపు రుణం ఉండి, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని వారు గ్రీవెన్స్‌లో అర్జీపెట్టుకోవచ్చు. ఇది కేవలం సూచనప్రాయంగా బ్యాంకర్లకు అందిన సమాచారం మినహా, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఎంత దగా
Published Sun, Nov 30 2014 12:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement