ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గాల్లో కలపడం ఖాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజ్ అన్నారు.
సదాశివపేట, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా గాల్లో కలపడం ఖాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జయరాజ్ అన్నారు. మంజీర జలాలు, తాగు, సాగుకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చే స్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయన్నారు.
యూపీఏ మంత్రులు చేసిన టెలికం, బొగ్గు కుంభకోణాల డబ్బులతో దేశంలోని పేదలందరికీ 35 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వవచ్చన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అసంఘటిత, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 12,500 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల ప్రజలకు మంజీర తాగు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇళ్ల స్థలాల పట్టాలిచ్చిన వారందరికీ వెంటనే పొజిషన్ చూపించి ఇందిరమ్మ రుణాలు మంజూరు చేయాలన్నారు.
మండల పరిధిలోని గంగకత్వవాగు ఎత్తు పెంచి కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి సాగుకు నీరందించాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఎం చేపట్టిన సైకిల్‌యాత్ర ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మండల కార్యదర్శి నర్సింలు, ఖయ్యూం, హోలి అహ్మద్, అడివయ్య, రవి, మల్లేశం, నరేందర్, గోపాల్ పాల్గొన్నారు.