రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న సహకార సంస్థ అది. బ్లాక్‌మార్కెట్ భూతం నుంచి రక్షించేందుకు రూపొందించిన వ్యవస్థ అది. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో అందించి ఆ రంగాన్ని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు ఆ సంస్థను నిర్లక్ష్యం రోగం కమ్ముకుంది. కోట్లాదిరూపాయల విలువైన ఆస్తులు నిరర్థకంగా మారుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలోని రైతాంగాన్ని బ్లాక్ మార్కెట్ భూతం నుంచి రక్షించేందుకు ఏర్పాటైన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లి.(డీసీఎంఎస్) నిర్వీర్యమైపోతోంది. దాళ్వా, సార్వా సీజన్లలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేసే డీసీఎంఎస్ పూర్వవైభవం కోల్పోతోంది. కోట్లాది ఆస్తులున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వాటిని కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కేవలం డీసీఎంఎస్‌ల ద్వారా మాత్రమే సరఫరా అయి వాటి ద్వారా వచ్చే కమీషన్ జీతభత్యాలకు ఉపయోపడేవిధంగా వ్యవస్థ ఉండేది.
ఇప్పుడు ఐసీడీఎస్, సంక్షేమ హాస్టళ్లు, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, స్టాంపుల విభాగం, పాఠశాలలు, ఉపాధిహామీ, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర వాటివల్ల భారీగా సొమ్ము సంపాదించిన డీసీఎంఎస్ ఇప్పుడు కేవలం రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు అక్కడక్కడ నిత్యావసర వస్తు విక్రయాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఫలితంగా సిబ్బంది జీతాలకు కూడా ఇబ్బంది పడాల్సివస్తోంది. సంస్థకు నిరుపయోగంగా ఉన్న ఆస్తుల్ని విక్రయించి వచ్చే సొమ్ముతో షాపింగ్ కాంప్లెక్సులు, మిల్లులు, కొత్త భవనాల నిర్మాణం చేస్తే దండిగా సొమ్ము వస్తుందనేది ప్రభుత్వానికి తెలియనిది కాదు.
ఖర్చు రూ. 2లక్షలు, ఆదాయం రూ. 58వేలు
డీసీఎంఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలతో పాటు నిర్వహణ ఖర్చులకు నెలకు రూ. 2లక్షలు అవసరం. మార్కెటింగ్ ద్వారా కేవలం రూ. 58వేలే వస్తుండడంతో ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సివస్తోంది. డీసీఎంఎస్‌కు జిల్లా వ్యాప్తంగా అరసవల్లిలో ఏడు గోదాంలు, కత్తెరవీధిలో 2, ఆమదాలవలసలో 5, పొందూరులో 4, రణస్థలంలో 2, నరసన్నపేటలో 5, పాలకొండలో 3, టెక్కలిలో 4, మెళియాపుట్టి(చాపర)లో 2, వీరఘట్టంలో 3, పాతపట్నం సహా చాలాచోట్ల ఖాళీ స్థలాలున్నాయి. వీటిలో చాలాచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటిని సరిచేయాలంటేనే తడిసిమోపెడు ఖర్చు. అదే విధంగా ఇప్పుడున్న సుమారు రూ. 100కోట్లకు పైగా ఉన్న ఆస్తుల్లో రూ. 15కోట్ల వరకూ విక్రయించే అవకాశం ఉంది. గతంలో జనపనారను ముడిసరుకుగా చేసేందుకు యంత్రాలు కొనుగోలు చేశారు. ఇప్పుడవి తుప్పుపట్టిపోయాయి. రూ.10లక్షల విలువ చేసే సామగ్రిని విక్రయించేందుకూ అనుమతి రావడం లేదు. వచ్చే సొమ్ముతో నూతన భవన నిర్మాణాలు, ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ నిర్మాణం చేయిస్తే బావుంటుందని సంస్థ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
అదే విధంగా పౌరసరఫరాలకు ఇచ్చే గోదాముల అద్దె చదరపు అడుగుకు రూపాయి ఇరవైపైసలే ఇస్తుంటే అదే సంస్థ ప్రైవేట్ గోదాములకు రూ.3 చెల్లిస్తోంది. జిల్లా యంత్రాంగం స్పందిస్తే డీసీఎంఎస్‌కు ఆదాయం పెరుగుతుంది. నాబార్డు సహా ఇతర ఆర్థిక సంస్థలు తమకు రుణ రూపంలో సొమ్ము ఇస్తే చాలా చోట్ల భవనాల్ని కాపాడుకుంటామని, వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించేస్తామని సభ్యులు చెబుతున్నారు. పాలకొండ, చాపర, హిరమండలం, వీరఘట్టం ప్రాంతాల్లో ఉన్న స్థలాల్లో కల్యాణమండపాలు కట్టిస్తే భారీ డిమాండ్ ఉంటుందంటున్నారు. పోనీ ఖాళీ స్థలాల్ని లీజుకివ్వాలంటే రాజకీయ ఒత్తిళ్లు సహా న్యాయపరమైన ఇబ్బందులుంటాయని భయపడుతున్నారు. తమకున్న 11పాయింట్లలో ఏపీసీడ్స్, మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులు, విత్తనాలు సేకరించి వాటిని రైతులకు సరఫరా చేయడం ద్వారా వచ్చే కమీషన్‌తోనే కాలం వెళ్లదీయాల్సివస్తోదంటున్నారు.
సహకారం లేకపోతే మనుగడ కష్టమే
ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే డీసీఎంఎస్ మనుగడ కష్టమే. నాణ్యమైన సరుకులందించాలన్నా, సంస్థ ఆస్తులు పెరగాలన్నా నేతల ముందుచూపు కావాలి. కోట్లాది ఆదాయం నుంచి లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలోనే ఆస్తులెక్కువున్న ఇక్కడి డీసీఎంఎస్‌ను కాపాడుకునేందుకు, నిర్వహణ వ్యయం కోసం ఆందోళన చెందాల్సివస్తోంది. నాబార్డయినా ఆదుకుంటే ఆర్థిక పురోగతి సాధిస్తాం.
- గొండు కృష్ణమూర్తి, చైర్మన్, డీసీఎంఎస్, శ్రీకాకుళం
డీసీఎంఎస్ దీనావస్థ
Published Thu, Jun 25 2015 3:18 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement