
వసూలు చేసిన ప్రతి పైసా ఖజానాకు చేరాల్సిందే
వసూలుచేసిన పన్నుల్లో ప్రతి పైసా ఖజానాకు చేరాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పూర్తి స్థాయిలో రాబట్టాలని, వసూలు చేసిన దాంట్లో ప్రతి ఒక్క పైసా ప్రభుత్వ ఖజానాకు జమ కావాలని అధికారులకు గవర్నర్ స్పష్టం చేశారు. ఆ విషయంలో ఉపేక్షిస్తే పథకాలు ప్రజలకు చేరవని ఆయన తెలిపారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సహాయం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు చెందిన అధికారులకు గవర్నర్ సూచన చేశారు.