
హస్తినకు చేరిన గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత తొలిసారిగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. బుధ, గురువారాల్లో ఇక్కడే ఉండి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి.చిదంబరంలతో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. షిండే, చిదంబరంలతో బుధవారం గవర్నర్ భేటీ ఖరారైంది.
గురువారం ప్రధానిని కలుసుకొనే అవకాశ ం ఉందని ఏపీభవన్ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో కూడా గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అవుతారని సమాచారం. ఈ సందర్భంగా గవర్నర్ ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పాలనా పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలను పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రానికి అదనపు బలగాల కేటాయింపుపైనా విజ్ఞప్తులు చేస్తారని సమాచారం. ఇక పాలనాపరంగా సహాయం అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా గల ఇద్దరు అధికారుల నియామకంపైనా ఆయన పెద్దలతో చర్చించవచ్చు.
గవర్నర్‌కు భద్రత పెంపు: రాష్ట్రపతి పాలన విధింపుతో రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టిన గవర్నర్ నరసింహన్‌కు ఏపీభవన్ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన బస చేసే శబరి బ్లాక్ పరిధిలో భద్రతా సిబ్బందిని పెంచారు. అనుమతి లేనిదే వేరెవర్నీ ఆ బ్లాక్‌లోకి పంపరాదన్న గవర్నర్ కార్యాలయ ఆదేశాలతో అక్కడి గేటును పూర్తిగా మూసేశారు. ఇక గోదావరి బ్లాక్‌లోకి సైతం గుర్తింపు కార్డులు, అనుమతి ఉన్నవారినే పంపిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఉపయోగించే బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియో వాహనాన్ని, అదనపు భద్రతా సిబ్బందిని గవర్నర్ కాన్వాయ్‌లో చేర్చారు. అయితే గవర్నర్ నరసింహన్ తానెప్పుడూ ప్రయాణించే హోండా సిటీ కారునే ఈసారి కూడా ఉపయోగించారు.