రాజప్పకు ఘనస్వాగతం
అమలాపురం:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కోనసీమలో ఘనస్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన తొలిసారిగా కోనసీమ పర్యటనకు వచ్చారు. పెద్దాపురం నుంచి ఆయన యానాం- ఎదుర్లంక వారధి మీదుగా కోనసీమలోకి ప్రవేశించారు. వారధి వద్దకు కోనసీమ నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమలాపురం వరకు భారీ ఊరేగింపుగా సాగారు. దారి పొడవునా బాణ సంచా కాలుస్తూ రాజప్పకు జేజే నినాదాలు చేశారు. మురమళ్ల, ముమ్మిడివరం, అనాతవరం మీదుగా అమలాపురం వరకు భారీ మోటార్ సైకిల్, కార్లతో ర్యాలీ సాగింది. అమలాపురం ఎర్రవంతెన వద్ద పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ నుంచి హైస్కూల్ సెంటరు, గడియారస్తంభం సెంటరు, ఈదరపల్లి మీదుగా సాగిన ర్యాలీ నల్లవంతెన, బాలయోగి ఘాట్‌కు చేరింది.
దివంగత నేత, తన రాజకీయ గురువు బాలయోగికి రాజప్ప ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి అమలాపురంలోని రంగనాయుడు కాలనీలోని తనస్వగృహానికి రాజప్ప చేరుకున్నారు. తిరిగి అక్కడ నుంచి బయలుదేరి భీమనపల్లి మీదుగా స్వగ్రామమైన ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లి చేరుకున్నారు. ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, మాజీమంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు, అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యాళ్ల మల్లేశ్వరరావు, ఆంధ్రబ్యాంక్ డెరైక్టర్ పరసా పరమేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మెట్ల రమణబాబు, పొలమూరి ధర్మపాల్, చిక్కాల గణేష్, బోనం అప్పారావు, నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, తిక్కిరెడ్డి నేతాజీ తదితరులు రాజప్పకు స్వాగతం
పలికినవారిలో ఉన్నారు.
‘మావోయిస్టుల బెడద లేదు’
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల సమస్య లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన మంగళవారం అమలాపురంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. చిన్నరాష్ట్రాలు ఏర్పడితే మావోయిస్టుల సమస్య తలెత్తుతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైమేరకు బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. కోనసీమలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
దివంగత నేత జీఎంసీ బాలయోగి అడుగుజాడల్లో పయనించి కోనసీమ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కోనసీమ రైల్వేలైను సాధనకు స్థానిక ఎంపీ పండుల రవీంద్రబాబు, జిల్లాకు చెందిన ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మానవప్రయత్నంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గాలించినా హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో కొట్టుకుపోయిన విద్యార్థులను గుర్తించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ఉధృతికి మట్టిలో వారు కూరుకుపోవడం గానీ, కిందకు కొట్టుకు పోవడం గానీ జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.