తిరుమలలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుమల గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు.
టీటీడీ అతిథి గృహంలో సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని ఆత్మీయంగా పలకరించారు.
బుధవారం ఉదయం సీఎం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల 59 లక్షల విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి అందజేస్తారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మ వారిని దర్శించుకుంటారు. ఆయనతో పాటు కేటీఆర్, కవిత కుటుంబసభ్యులు, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, పద్మారావు, ఐకే రెడ్డి తదితరులు ఉన్నారు.