స్వీపర్ పోస్టును లాక్కుంటున్నారు
* అధికార పార్టీ నేతలపై ఫిర్యాదుల వెల్లువ
* గ్రీవెన్స్‌సెల్‌కు 232 ఫిర్యాదులు
విజయనగరం కంటోన్మెంట్: నిరుపేదనైన తనను పాఠశాల స్వీపర్‌గా నియమించుకోమని గ్రామైక్య సంఘం శానిటరీ రిపోర్టు పంపిస్తే తనను కాకుండా..ఏ అర్హతలూ లేని మరొకరిని నియమించారని కొమరాడ మండలం కందివలసకు చెందిన బచ్చల భవాని అధికారుల ముందు వాపోయింది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 232 అర్జీలు వచ్చాయి.
కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఆర్వో మారిశెట్టి జితేంద్రలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బచ్చల భవాని మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు వచ్చిన స్వీపర్ పోస్టును తనకు కాకుండా చేసేందుకు నాయకులు రాజకీయంగా ప్రయత్నిస్తున్నారని దానికి అధికారులు కూడా సహకరిస్తున్నారని ఫిర్యాదులో పొందుపరిచింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
భూములను ఇవ్వడం లేదు
30 ఏళ్ల క్రితం బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన 14 మంది దళితులకు నాలుగెకరాల చొప్పున ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమకు కాకుండా చేస్తున్నారని గ్రామానికి చెందిన కురమాన పైడియ్య, రాయి వెంకయ్య, గర్భాపు చిన్నమ్మి, కాగాన సింహాచలం తదితరులు ఫిర్యాదు చేశారు. గొర్లె సీతారాం పురంలో తమకు కేటాయించిన భూమిని వెంటనే ఇప్పించాలని కోరారు.
కోళ్ల ఫారాలతో దుర్గంధం
పూసపాటి రేగ మండలం కుమిలి గ్రామం చుట్టూ ఇప్పటికే పెద్ద పెద్ద కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసి ఉండడం వల్ల తీవ్ర దుర్గంధంతో ప్రజానీకం ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు ఎస్సీ కాలనీలో కొత్తగా కోళ్ల ఫారం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని గ్రామానికి చెందిన జి నాగిరెడ్డి, బి రాము తదితరులు ఫిర్యాదు చేశారు. కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరారు.
అనుమతిలేని క్రషర్లతో అవస్థలు
వేపాడ మండలం రామస్వామి పేటలో అనుమతులు లేకుండా ఏడు క్రషర్లు నడుస్తున్నాయని అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని నిలిపివేయించాలని గ్రామ సర్పంచ్ పత్రి బాలకృష్ణ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. కేవలం కిలోమీటరు పరిధిలో ఏడు క్రషర్లనూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేకుండా నడుపుతున్నారన్నారు.
వీఆర్‌ఏకు ఎస్సీ కార్పొరేషన్ రుణమిచ్చారు. సీతానగరం మండలం పెదంకలాం గ్రామానికి చెందిన అర్హులు ఎంతో మంది రుణాలకు దరఖాస్తు చేసుకున్నా రుణాలివ్వని అధికారులు, బ్యాంకర్లు ఓ ప్రభుత్వోద్యోగి అయిన వీఆర్యే పెంటకోట శంకరరావుకు సబ్సిడీ రుణం మంజూరు చేశారని గ్రామానికి చెందిన చింతాడ పైడయ్య ఫిర్యాదు చేశారు. ఇతనికి లోను రద్దు చేయించి అర్హులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.