గ్రూప్–2 మెయిన్స్ ప్రశ్నలు లీక్!
గ్రూప్–2 మెయిన్స్ ప్రశ్నలు లీక్!
Published Mon, Jul 24 2017 1:30 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM
- సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న స్క్రీన్‌షాట్స్
- అవి ఫేక్ స్క్రీన్‌షాట్స్.. దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గత వారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షపై వివాదం నెలకొంది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో కలకలం రేగుతోంది. పేపర్ లీకైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, రాయలసీమ,కోస్తా కేంద్రాల్లో అక్రమాలు
గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లతో నిర్వహించారు.తొలిరోజు విశాఖపట్నంతో సహా మరికొన్ని కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని కేంద్రాల్లో పరీక్ష మధ్యలోనే నిలిచిపోయింది. విశాఖపట్నం గీతం వర్సిటీ కేంద్రంలో పరీక్ష ఆగిపోయి, తిరిగి ఎంతసేపటికీ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. పరీక్ష మళ్లీ ప్రారంభమయ్యాక కొందరు హాజరై పరీక్ష రాశారు. కొన్ని కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా స్క్రీన్‌షాట్లు తీసి, ప్రశ్నలను బయటకు పంపి సమాధానాలు రప్పించి, ఎంపిక చేసిన అభ్యర్థులతో రాయించారని కొందరు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటున్నారు. గ్రూప్–2 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తాం..
గ్రూప్–2 పరీక్ష ప్రశ్నల స్క్రీన్‌షాట్లు ఏ కేంద్రంలో తీశారో తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ చెప్పారు. మొదటి రోజు కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. విశాఖ గీతం వర్సిటీ కేంద్రంలో పరీక్ష మధ్యలో నుంచి వెళ్లిపోయిన వారిని గైర్హాజరు జాబితాలో చేర్చామని వెల్లడించారు. ప్రచారంలోకి వచ్చిన ప్రశ్నల స్క్రీన్‌షాట్లు ఫేక్ కావొచ్చని అన్నారు.
పుకార్లు వ్యాపింపజేస్తున్న వారిపై చర్యలు
స్క్రీన్‌షాట్ల అంశంపై ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్‌పై ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న గ్రూప్–2 పరీక్ష ప్రశ్నల స్క్రీన్‌షాట్లు ఫేక్ అని, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పేర్కొంది. పుకార్లు వ్యాపింపజేస్తున్న వారిని కనిపెట్టి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Advertisement
Advertisement