నరసరావుపేట టౌన్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం ఐదేళ్లపాటు విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలు, అక్రమ వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాడు అణచివేతకు గురైన గొంతుకలు నేడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో తిరగబడుతున్నాయి. తమ పొట్టలు కొట్టి కట్టిన అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కే ట్యాక్స్ బాధితులు గత వారం రోజులుగా నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లకు బారులు తీరుతున్నారు. కోడెల కుటుంబంపై ఫిర్యాదుల పరంపర మంగళవారం కూడా కొనసాగింది.
అమాయకుల నుంచి వసూళ్లు
టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాం, విజయలక్ష్మి సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయించారు. విలువైన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్, అపార్ట్‌మెంట్‌ల అనుమతుల వ్యవహారంలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. కే ట్యాక్స్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కోడెల కుటుంబ సభ్యులు తమ రక్తం పీల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పొలం కబ్జా చేస్తామని బెదిరింపులు
సత్తెనపల్లి పట్టణానికి చెందిన జెల్ది విజయప్రసాద్ మాచవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు నరసరావుపేట మండలం కేసానుపల్లి వద్ద వారసత్వంగా భూమి వచ్చింది. ఆ పొలంపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్ను పడింది. ఆక్రమించేందుకు తన అనుచరులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబును అక్కడికి పంపించారు. విజయలక్ష్మితో మాట్లాడుకొని, కే ట్యాక్స్ చెల్లిస్తే కబ్జాకు గురికాకుండా ఉంటుందని వారు చెప్పటంతో ఆమె వద్దకు విజయప్రసాద్ వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగాలంటే తనకు రూ.15 లక్షలు కట్టాలని, లేకుంటే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు పొలం కూడా ఆక్రమిస్తానని విజయలక్ష్మి బెదిరించడంతో విజయప్రసాద్ ఒప్పుకొని మొదట రూ.10 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.5 లక్షల కోసం విజయలక్ష్మి, రాంబాబు, శ్రీనివాసరావు బెదిరించారని, కులం పేరుతో దూషించారని పోలీసులకు బాధితుడు విజయప్రసాద్ ఫిర్యాదు చేశాడు.
స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.10 లక్షలు వసూలు
నరసరావుపేట మండలం గుంటగార్లపాడులో పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన 2.50 ఎకరాల్లో స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు ప్లాట్లుగా మార్చా. విషయం తెలుసుకున్న కోడెల కుమార్తె విజయలక్ష్మి తన పీఏ శ్రీనివాసరావు ద్వారా కబురు చేశారు. ఎవరిని అడిగి ప్లాట్లు వేశావని ప్రశ్నించారు. అన్ని అనుమతులు తీసుకున్నానని చెప్పినప్పటికీ వినకుండా నన్ను బెదిరించారు. రూ.10 లక్షలు బలవంతంగా వసూలు చేశారు. దీనిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశా.
– తాళ్ల వెంకట కోటిరెడ్డి, నరసరావుపేట
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7 లక్షలు కాజేశారు
మున్సిపల్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ కింద ఉద్యోగం ఇప్పిస్తానని విజయలక్ష్మి రూ.5 లక్షలు తీసుకుంది. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాకపోవడంతో కోడెల ఇంటిలో ఉండే కొల్లి ఆంజనేయులును సంప్రదించగా, ఆయన మరో రూ.2 లక్షలు తీసుకున్నాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో వారిన అడగ్గా విజయలక్ష్మి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశా
– ఆలా శేఖర్, నరసరావుపేట
నరరూప రాక్షసుడు శివరాం
కోడెల శివరాం మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడని విరించి రిసార్ట్స్ అధినేత నెల్లూరి వంశీకృష్ణ ఆరోపించారు. తన వద్ద రూ.2.30 కోట్ల కే ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపిస్తూ ఆయన మంగళవారం నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశారు. కోటప్పకొండ వద్ద 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి, వెంచర్ వేసేందుకు 2014లో మొదటి విడత 50 ఎకరాలకు ల్యాండ్ కన్వర్షన్‌కు అర్జీ పెట్టానన్నారు. కోడెల శివరాం తనను పిలిచి, ఎకరాకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వనందుకు ఏడాది పాటు అనుమతులు రాకుండా అడ్డుపడ్డాడని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు కూడా సహాయం చేయకపోవడంతో మరో గత్యంతరం లేక ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున కోడెల శివరాంకు చెల్లించానన్నారు. రెండో విడతలో 65 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్‌కు సంబంధించి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున కే ట్యాక్స్ చెల్లించానని తెలిపారు. దీంతో పాటు నరసరావుపేటలో ఏ కార్యక్రమం చేపట్టినా తనకు ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో రూ.35 లక్షల వరకు చెల్లించానన్నారు. కలిసి వ్యాపారం చేద్దామని తనను కోరగా మౌనం వహించడంతో బెదిరింపులకు పాల్పడి. తనతో రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టించి, తన వాటాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా శివరాం మోసం చేశాడని చెప్పారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో నరసరావుపేట, సత్తెనపల్లిలో స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు కే ట్యాక్స్ చెల్లించలేక వ్యాపారాలు మానుకున్నారని గుర్తుచేశారు. మద్యం దుకాణాల కేటాయింపులో కే ట్యాక్స్ చెల్లించలేక టీడీపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. కోడెల శివరాం వేధింపులు భరించలేక మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వెల్లడించారు. కే ట్యాక్స్‌పై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ కేసుల్లో ఇరికించేవాడన్నారు. అధికారులంతా అతడి చెప్పుచేతల్లోనే ఉండటంతో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో సమయం కోసం ఎదురు చూశామన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కోడెల కుటుంబ అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధితులందరికీ న్యాయం చేయాలని నెల్లూరి వంశీకృష్ణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment