సాక్షి, అమరావతి: సామాన్యుడికి భారీ ఊరట కల్పిస్తూ చింతపండుపై పన్నును ఎత్తివేసేలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గట్టి వాదనలు వినిపించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఏపీ గళాన్ని సమర్థంగా వినిపించడం ద్వారా చింతపండుపై పన్నును ఎత్తివేసేలా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయం సాధించారు. గోవాలో శుక్రవారం జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తన వాదనతో బుగ్గన దేశం దృష్టిని ఆకర్షించారు. దక్షిణాది ప్రజల వంటకాల్లో కీలకమైన ఎండు చింతపండును పన్ను పరిధిలోకి తేవటాన్ని రాష్ట్రం తొలినుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆహార ధాన్యాలను జీఎస్టీ పరిధి నుంచి తప్పించి చింతపండును మాత్రం సుగంధ ద్రవ్యాల విభాగంలో చేర్చి పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలుత చింతపండుపై 12 శాతం పన్ను విధించగా ఆ తర్వాత 5 శాతానికి తగ్గించారు. అయితే నిత్యం వంటల్లో వినియోగించే చింతపండుపై పన్నును పూర్తిగా తొలగించాలని ఏపీ గట్టిగా పట్టుబట్టింది.
స్పైసెస్ ఎలా అవుతుంది?
అడవుల్లో గిరిజనులు సేకరించి విక్రయించే చింతపండు సుగంధ ద్రవ్యాల పరిధిలోకి రాదని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన గట్టిగా వాదించారు. ఉత్తరాది రాష్ట్రాలు వ్యతిరేకించినా బుగ్గన వాదనకు దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి మద్దతు లభించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపయోగించే ఒక రకమైన చనాదాల్ (పచ్చి శనగపప్పు)ను పన్ను నుంచి ఉపసంహరించినప్పుడు చింతపండుపై ఎందుకు తొలగించకూడదని బుగ్గన ప్రశ్నించారు.
ఆంగ్లేయులే చింత అవసరాన్ని గుర్తించారు...
చింతపండు ఆవశ్యకతను గుర్తించిన ఆంగ్లేయులే చింతచెట్లను వంట చెరుకు కోసం కొట్టివేయకూడదంటూ చట్టం తెచ్చారని బుగ్గన కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై దాదాపు 15 నిమిషాలకుపైగా చర్చ జరగ్గా బుగ్గన వాదనతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి ఏకీభవించారు. దీంతో చింతపండుపై ఉన్న 5 శాతం పన్నును తొలగిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని గిరిజనులకు ఊరట లభించనుంది.
పట్టుబట్టి మరీ సాధించి...
రాష్ట్రంలో 2018–19లో 5,252 హెక్టార్లలో చింత సాగు చేయగా 57,738 టన్నుల చింతపండు ఉత్పత్తి అయినట్లు ఉద్యానవన శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లుగా 36 సమావేశాలు నిర్వహించగా మన రాష్ట్రం ఇప్పటిదాకా ఇంత గట్టిగా వాదించిన సందర్భం లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విజయంతో నాపరాళ్లు, చుట్ట పొగాకు తదితరాలపై పన్ను తొలగింపు డిమాండ్‌ను నెరవేర్చుకోగలమనే నమ్మకం ఏర్పడిందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment