జీఎస్టీ అమల్లోకి వచ్చాక గూబ గుయ్యిమనించిన పన్ను పోటుతో సతమతమైన జీవీఎంసీకి కాస్త ఊరట లభిం చింది. నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులపై పన్ను రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ పర్యవేక్షక మండలి సర్క్యులర్ జారీ చేసింది.
విశాఖసిటీ: మహా విశాఖ నగర పాలక సంస్థకు జీఎస్‌టీ నుంచి కొంత ఊరట లభించింది. అభివృద్ధి పనులపై 18 శాతం శ్లాబులో ఉంచిన ప్రభుత్వం తాజాగా 12 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని ప్రాజెక్టులకూ 5 శాతం వ్యాట్.. మరో 5 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండేది. స్థానిక సంస్థలు ఏవీ ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించేవి కాదు. అంటే.. కేవలం 5 శాతం వ్యాట్ మాత్రమే పన్ను రూపంలో ప్రాజెక్టు నిధుల నుంచి వెళ్లేవి. ఇప్పుడు జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్‌టీ అమల్లోకి రావడంతో.. ఈ ప్రాజెక్టులపై ఏకంగా.. 18 శాతం చెల్లించాల్సి వస్తోంది.
అంటే 13 శాతం అదనపు భారం పడుతుండడంతో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాజా ఆదేశాలతో భారం తగ్గనుంది. 18 శ్లాబులో ఉంటే ఏడాదికి రూ.250 కోట్ల పనులు పూర్తి చేస్తే రూ. 45 కోట్ల జీఎస్‌టీకి చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు 12 శాతం శ్లాబులోకి తీసుకురావడంతో రూ.30 కోట్లు మాత్రమే భారం పడనుంది. దీంతో కొంత మేర ఉపశమనం లభించిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.