నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండల (జాక్టో) నాయకులు గురువారం డీఈఓ మువ్వా రామలిం గంతో భేటీ అయ్యారు. దర్గామిట్టలోని డీఈఓ కార్యాలయంలో గురువారం డీఈఓ, జాక్టో నాయకుల మధ్య చర్చలు జరిగాయి. పలు సమస్యలపై డీఈఓ సానుకూలంగా స్పందించారు.
ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఈ నెల 15, 16వ తేదీల్లో అప్పీళ్లను స్వీకరించి, అర్హత గల జాబితాతో ఆర్జేడీ అనుమతి మేరకు ఈ నెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 29న స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను చేపడతామని వివరించారు. మిగిలిన సమస్యలను నెలాఖరులోపు పరిష్కరిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆం దోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తామని వివరించారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగేంద్రకుమార్, బీటీఏ నాయకుడు మాల్యాద్రి, ఏపీటీఎఫ్ నాయకుడు సుబ్రహ్మణ్యం, ఇతరులు సుబ్బారావు, పద్మజ, కృష్ణారెడ్డి, ఆదినారాయణ పాల్గొన్నారు.