బాబు హామీల గాలం
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం చేపట్టిన ప్రజాగర్జన సభలో ఓటర్లకు గాలం వేసేందుకు వరుస హామీలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రసంగం ప్రారంభంలోనే చిత్తూరు జిల్లా సమస్యలు, స్థానిక సమస్యలను ప్రస్తావించారు. తొలుత తనకు వేంకటేశ్వరస్వామి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు శక్తిని ఇస్తాడని, శ్రీవారు మన అందరి ఇలవేల్పు అంటూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రసంగంలో మధ్యలో ‘ఏం తమ్ముళ్లు..చెప్పండి.. నేను చెప్పింది కరె క్టేనా’ అంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు.
తొమ్మిది సంవత్సరాలు సీఎంగా ఉంటూ తాను ఏ పనులు అయితే చేయలేకపోయారో వాటన్నింటిని ఈసారి సీఎం అయితే చేస్తానని, నమ్మండి అంటూ ముఖ్యంగా యువతను అభ్యర్థించారు. దీనిలో భాగంగా గాలేరు-నగరి, హంద్రీ-నీవా, స్వర్ణముఖి-సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు తాగునీరు లేకపోతే కల్యాణి డ్యాం పైపు లైన్ నిర్మించానని, బర్డ్, రుయా, స్విమ్స్ ఆస్పత్రులను ఒక్కటిగా చేశామని చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ప్రాణదానం స్కీమ్ ప్రారంభించి తిరుమల వెళ్తూంటే తనపై 22 క్లేమోర్ మైన్స్‌తో దాడి జరిగిందని, మీకు మేలు చేసేందుకే తనను వేంకటేశ్వరస్వామి బతికించారని గుర్తుచేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అలాగే తిరుపతిని వాటికన్ సిటీగా మారుస్తామని, ఆ బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని రెండుసార్లు చెప్పారు. తాగునీటికి కొరత లేకుండా చూస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత, ఆరోగ్యభద్రత కల్పిస్తామన్నారు. వారికి ఇళ్లస్థలాలు కేటాయించేందుకు చర్యలు చేపడతామన్నా రు. ఉచిత కరెంట్, రుణమాఫీ ప్రకటించారు.
జన్మభూమి రుణం తీర్చుకుంటా
‘‘నేను ఇక్కడే పుట్టాను, తిరుపతిలోనే పెరిగాను, నాకు రాజకీయాలు నేర్పింది తిరుపతి. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నది చిత్తూరు జిల్లా వాసులే. మీలో ఒకడిగా ఉంటూ వ్యవసాయ పనులు చేశాను. నేను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది ఇదే తిరుపతిలోనే. పక్కనున్న ఎస్వీ యూనివర్సిటీలోనే నేను చదువుకున్నది. జన్మభూమి రుణం తీర్చుకుంటాను.
కచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడేవిధంగా పని చేస్తాను’’ అంటూ ముఖ్యంగా తిరుపతి ఓటర్లకు గాలం వేసేందుకు తంటాలు పడ్డారు. ఉపన్యాసం ముందు, చివరన ఎక్కువగా యువతను, మహిళలను, మధ్యతరగతి వారిని, కార్మికులను ఇలా రంగాల వారీగా వారి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. నిత్యావసరవస్తువుల ధరల ప్రస్తావన, పెట్రోల్‌డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలెండర్ల కోత, ఆధార్ సమస్యలు.. ఇలా ప్రతి అంశాన్ని పేర్కొంటూ ఎన్నికల ప్రసంగం చేశారు. పదే, పదే ‘‘నన్ను ఆశీర్వదించండి, ఓట్లు వేసి గెలిపించండి. నన్ను ఆశీర్వదించండి బుల్లెట్‌లా దూసుకెళ్తా’’ అంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
పల్చబడిన జనం
జిల్లా వ్యాప్తంగా ప్రజాగర్జనకు తెలుగుతమ్ముళ్లు ఆర్‌టీసీ బస్సులు, ప్రైవేట్ జీపులు, కార్లు అద్దెకు తీసుకుని జనాన్ని తరలించినా ఒక దశలో జనం పల్చబడ్డారు. 2 గంటలకని చెప్పిన మీటింగ్ 4.30 గంటలకు ప్రారంభం కావటం, చంద్రబాబు ఉపన్యాసంలో కొత్తదనం లేకపోవటంతో పార్టీకార్యకర్తలు, నాయకులు లేచి వెళ్లిపోవడం కనపడింది. చంద్రబాబు విజన్ 2020 గురించి ప్రస్తావిస్తున్న సమయంలోనే వెనుక ఉన్న కుర్చీలు చాలా వరకు ఖాళీ అయ్యాయి. వేదికపై ఉన్న టీడీపీ రాష్ట్రనాయకులు, ఎమ్మెల్యేలే చంద్రబాబు ఉపన్యాసం సమయంలో నిద్రపోతూ కనిపిం చారు. చివరలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రజాగర్జనకు హాజరైన పార్టీనాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు.