అందరి దారి ఒకటైతే.. బాబుది మరోదారి!
=చంద్రబాబు విభజన పాట
=వేదికపై ఎంపీ శివప్రసాద్ సమైక్య బీరాలు
=అధినేత తీరుపై క్యాడర్‌లో అసహనం
=రొటీన్‌గా సాగిన టీడీపీ అధినేత పర్యటన
=ఎన్నికల వేడి పుట్టించలేక పోయిన ప్రసంగం
సాక్షి, తిరుపతి: జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలందరిదీ ఒక దారైతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుది మాత్రం మరోదారనే విషయం మళ్లీ స్పష్టమయింది. ప్రజాగర్జన పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం తిరుపతి నుంచి ప్రారంభించిన చంద్రబాబు నాయుడు తన ప్రసంగంతో పార్టీ క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయారు. జిల్లాలో అందరూ సమైక్యం కోరుకుంటున్నా ఆయన తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదలకుండా ప్రసంగించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తానని గానీ, తానూ సమైక్యవాదినని గానీ చెప్పలేదు. దీంతో తాము ప్రజల్లోకి ఎలా వెళ్లేదంటూ జిల్లాలోని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అధినేత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజాగర్జన అని సభ పెట్టి ఇక్కడ ప్రజల కోరుకుంటున్న సమైక్యాంధ్రను ప్రస్తావించకుండా ఉపన్యసించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటిస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుం దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సవాల్ విసిరినా, దీనిని స్వీకరించలేని స్థితిలో విభజనకు అంగీకరిస్తామని, ఇరుపక్షాల వారి వాదనలు వినాలని, అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు మాట్లాడడం టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు మింగుడు పడడం లేదు.
మరో వంద రోజుల్లో ఎన్నికలు ఉన్న సమయంలో వైఎస్‌ఆర్ సీపీ నేరుగా సమైక్యవాదంతో ప్రజల్లోకి వెళ్తుంటే తాము ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు లోలోపల అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదే విషయాన్ని ఒకరిద్దరు నాయకులు బాహాటంగానే మీడియా ప్రతినిధుల వద్ద గర్జన ముగిసిన వెంటనే ప్రస్తావించడం గమనార్హం. అదే సమయంలో చంద్రబాబు మినహా, మిగిలినవారు సమైక్యం ఉన్న రాష్ట్రాన్ని సోనియాగాంధీ విభజించిందని, చిచ్చుపెట్టిందని విభజనను అడ్డుకుంటామని మాట్లాడడం గమనార్హం.
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అయితే ఏకంగా అపరిచితుడు వేషం వేసి సోనియాపై విభజన చిచ్చుపాట పాడుతూ, డైలాగ్‌లు విసురుతూ చిందులేశారు. వర్లరామయ్య, కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు కూడా రాష్ట్ర సమైక్యతకు విఘ్నం కలిగితే చూస్తూ ఊరుకోం అన్న తరహాలో తమ ఉపన్యాసాలు అదరగొట్టారు. అధినేత మాత్రం తాను విభజనకు అనుకూలమని చెప్పకనే చెప్పారు. దీంతో కార్యకర్తలకు ఎవరి మాటాలు నమ్మాలో అర్థంకాక వెనుతిరిగారు.
ప్రైవేట్ హోటల్‌లో మంతనాలు
జిల్లాలో కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? వారి పరిస్థితి ఏమిటి? అనే వివరాలను చంద్రబాబు జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, కోడెల శివప్రసాద్ సమక్షంలో చర్చించారు. వీరితో పాటు శాసనమండలి ఫ్లోర్ లీడర్ యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబును ఆదివారం ఉదయం కలిశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి చేరుకున్న చంద్రబాబు ఆర్‌టీసీ బస్టాండ్ సమీంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జిల్లా పార్టీ ముఖ్యనాయకులతో మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశమయ్యారు.
జిల్లాలో నియోజకవర్గాల వారీ పార్టీ పరిస్థితితో పాటు, వలసలు ఎవరెవరు రానున్నారు, వారి ఆర్థికపరిస్థితి ఏమిటి, పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీలో అంతర్గతంగా అసంతృప్తులు చెలరేగే అవకాశం ఉందా అన్న వివరాలు చంద్రబాబు ఆరా తీశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు సైకం జయచంద్రారెడ్డితో సహా, చంద్రగిరి నియోజకవర్గానికే చెందిన తిరుపతిలో చురుకుగా ఉన్న ఒక డాక్టర్ పార్టీలో చేరే వ్యవహారం, కాంగ్రెస్‌లో కీలక వ్యక్తులు ఎవరెవరు చేరే అవకాశం ఉందనేదానిపై ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సమాచారం.