
హామీల పై వెనక్కి వెళ్లను : బాబు
దానికి తగిన ప్రణాళిక రచిస్తాం
రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి
తెలంగాణ అభివృద్ధికి సాయపడుతాం
న్యూఢిల్లీ: ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజుల్లో వారి కష్టాలు దూరం చేసే సదుద్దేశంతోనే రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి హామీలు ఇచ్చానని... వాటి నుంచి దూరంగా వెళ్లబోనని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో పరిస్థితి హీనంగా మారినా హామీల అమలుకు తగిన ప్రణాళిక రూపొందిస్తానన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈరోజు సుదినం. పదేళ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన దేశానికి ఒక శుభారంభం జరిగింది. మోడీ ప్రధాని కానుండడం దేశంలో ఒక కొత్త శకానికి ప్రారంభం. ఒక కొత్త ఆశ. ఎఫ్‌డీఐలు, పెట్టుబడులు, సుపరిపాలన, నిజాయతీ కలిగిన పాలన కోసం దేశం చూస్తోంది. మొన్నటి ఎన్నికల్లో అవినీతిపై ప్రజలు తీర్పు ఇచ్చారు. మోడీ తొలుత 272+ లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగారు. టీడీపీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో నేను ఆనాడే హైదరాబాద్‌లో ఎన్డీఏకు 300కు పైగా స్థానాలు వస్తాయని చెప్పాను. 330కి పైగా వచ్చాయి. ప్రజలు ఆవేదన ఓటుగా మారింది. దేశం ఇప్పుడు ఉపశమనంగా భావిస్తోంది. రాష్ట్రంలో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ప్రజలు కసిగా కాంగ్రెస్‌ను ఓడించారు. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ పునాదుల నుంచి అభివృద్ధి చేయాలి. తెలంగాణలో కూడా సామాజిక అభివృద్ధి జరగాలి. నేను చేపట్టిన పనులు సంపద, ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తాం. కేంద్రం నుంచి కూడా సాయం అందేలా చూస్తాం’’ అని పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వంలో చేరతాం
ఎన్డీఏ ప్రభుత్వంలో తాము చేరతామని చంద్రబాబు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్రంలో గతంలో జనతా ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం, యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చామని ఆయన గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమీ లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నరేంద్ర మోడీ తనకన్నా ముందుగా అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై స్పందిస్తూ అది తాను లెక్కలోకి తీసుకునే అంశం కాదన్నారు. జగన్ మోడీని కలవడంలో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. అలాగే జగన్ కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చంద్రబాబు చెప్పారు. ఈ విషయమై రోజూ చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అవినీతిరహిత దేశమే ఆశయమని మోడీ, తాను చెప్పామని బాబు గుర్తుచేశారు. అవినీతిని ప్రక్షాళన చేయడంతోపాటు అవసరమైతే అవినీతిపరులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేసే సంస్కరణలు కూడా తెస్తామన్నారు. ఆర్థిక, న్యాయపరమైన, పరిపాలనాపరమైన సంస్కరణలు కూడా తెస్తామని వివరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రభుత్వంలో భాగస్వామిని చేస్తారా? అని అడగ్గా ఆయన పదవులను ఆశించి ఎన్నికల ప్రచారానికి రాలేదని బాబు చెప్పారు. కానీ ఆయన సలహాలను తీసుకుంటామన్నారు.
రాజధాని నగర ప్రాంతమై ఉండాలి...
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అందరికీ మధ్యలో ఉండాలని, నగర ప్రాంతమై ఉండాలని చంద్రబాబు అన్నారు. విభజన చేసేటప్పుడు హేతుబద్ధత ఉండాలని తాను ముందే చెప్పినా మీడియా తనను అర్థం చేసుకోలేదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతమని ఎగతాళి చేసిందన్నారు. అయితే ప్రజలు అర్థం చేసుకున్నారని, అందుకే సీమాం ధ్రలో పట్టంకట్టారని, తెలంగాణలోనూ తనను అభిమానించారని బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల అభద్రతా భావాన్ని తాము తొలగిస్తామని చంద్రబాబు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రజలందరినీ ఒక్కటి చేసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.
హస్తినలో బాబు బిజీబిజీ
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల అనంతరం హస్తినకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి ఎక్కువ స్థానాలు గెలవడంతో బీజేపీ అగ్రనేతలందరినీ కలిసి అభినందనలు తెలిపారు. ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో తమకు దక్కే స్థానాలకు సంబంధించి సమాలోచనలు చేశారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో తమ పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం దక్కుతుందో లేదోనన్న మీమాంసలో ఉన్న బాబు ఆ పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలనూ ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలతో కలిసి బీజేపీ నేత వెంకయ్యనాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఎన్‌డీఏ కూటమిలో ఉన్న టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పించేలా బీజేపీ అగ్రనాయకులను ఒప్పించాలని వెంకయ్యను బాబు కోరినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం బీజేపీ అగ్రనేత అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న బాబు...ఆపై ఏపీ భవన్‌లోని ముఖ్యమంత్రి కాటేజీకి చేరుకొని ఎన్‌డీఏ కూటమిలో మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో భేటీ అయ్యారు. ఎన్‌డీఏపక్షాల భేటీ అనంతరం బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో కాసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాత గుజరాత్ భవన్ చేరుకొని నరేంద్రమోడీతో సుమారు అరగంటపాటు ఏకాంత చర్చలు జరి పారు. రెండు కేబినెట్ పదవులు, ఒక ఇండిపెండెంట్ మంత్రి పదవి, రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. చివరగా బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీని కలిసి తిరిగి ఏపీభవన్‌కు చేరుకున్నారు.