కాయ్ రాజా.. కాయ్.. | Gudiwada become a hub of gamblers | Sakshi
Sakshi News home page

కాయ్ రాజా.. కాయ్..

Published Wed, Aug 6 2014 9:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

కాయ్ రాజా.. కాయ్..

కాయ్ రాజా.. కాయ్..

* ప్రవేశం ఇలా..
 *పేకాట ఆడాలనకునే వ్యక్తి ముందుగా రూ.2వేలు చెల్లించి లోపలికి వెళ్లాల్సి ఉంది.
  *ఎంత డబ్బుతో ఆడగలడో దానికి సంబంధించి టోకెన్‌ను తీసుకుని టేబుల్‌పై కూర్చుని ఆడాలి.
  *ఆటలో గెలిచిన వ్యక్తి తన వద్ద ఉన్న టోకెన్లు గుడివాడ ఆటోనగర్‌లోని 5వ నంబరు రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఇచ్చి ఆ మేరకు సొమ్ము తీసుకోవాల్సి ఉంటుంది.
 
గుడివాడ అర్బన్ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి జూదరులు తరలివస్తున్నారు. రోజూ లక్షలాది   రూపాయలు చేతులు మారుతున్నాయి. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఈ జూద శిబిరాలు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఎవరైనా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరోవైపు కొందరు పోలీసులు కూడా ముడుపులు పుచ్చుకుని జూద శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారని తెలుస్తోంది.

 ఎక్కడ ఆడుతున్నారంటే..
 పట్టణ పరిసరాల్లోని 20 ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఏకకాలంలో కాకుండా ప్రతి రోజు ప్రాంతాలు మారుస్తూ ఉంటారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జూదరులకు తెలియజేస్తూ పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపాన ఓ ప్రైవేటు కార్యాలయం, మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న కాలువగట్టుపై ఓ బిల్డింగ్‌లో పేకాట ఆడుతున్నారు.

 బొమ్ములూరు గోదాముల వద్ద, పామర్రు రోడ్డులోని రైల్వేగేటు సమీపంలోని ఓ ఐరన్ దుకాణం వద్ద, రామనపూడి నుంచి నూజెళ్లకు వెళ్లే రోడ్డులో కాలువగట్టుపై పాకలో, ఇదే రోడ్డులో రొయ్యిల చెరువు వద్ద జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలన్నీ రెండు పోలీసు స్టేషన్లకు సరిహద్దులో ఉండటం వల్లే వాటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఫోన్ చేసి పేకాట గురించి సమాచారం ఇస్తే పోలీసులు ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదు.. అంటూ బదులిస్తున్నారు. చివరికి ఏ స్టేషన్ వారు వెళ్లాలని నిర్ణయించుకునేలోపు జూదరులు జారుకుంటున్నారు.  

 సూత్రధారి అధికార పార్టీ నేత!
 గతంలో పేకాట క్లబ్బులు నడిపిన అనుభవం ఉన్న టీడీపీ నాయకుడు ఒకరు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తన చేతికి పని చెప్పారు. కొందరు పోలీసులకు మామూళ్లు రుచిచూపి తన దందాను కొనసాగిస్తున్నాడు. దాదాపు 120మందికిపైగా ఈ ఆటలో పాల్గొంటారని తెలుస్తుంది. పేకాట ఆడే ప్రదేశాన్ని ముందుగానే ఫోన్ ద్వారా జూదరులకు సమాచారం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10గంటల వరకు 13ముక్కల ఆట, రాత్రి 10  నుంచి తెల్లవారుజాము 3గంటల వరకు లోనా-బయటా(కోసు)లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

 పోలీసుల్లో కోవర్టులు
 పేకాట ఆడుతున్నారనే సమాచారాన్ని ఇటీవల ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తెలియజేశాడు. ఆ సమాచారం జూద శిబిరాల నిర్వాహకుడికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి అందింది. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డారు. గత శుక్రవారం గుడ్లవల్లేరు శ్మశానవాటిక, గుడివాడ మార్కెట్ యార్డుల వద్ద జూదశిబిరాలపై పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుని, అతి తక్కువ లభించినట్లు వెల్లడించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుడిపై కేసులు లేకుండా చేసేందుకు గాను రూ.40వేలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వ్యక్తి గతంలో జూద శిబిరాలు నిర్వహిస్తుండగా అప్పటి ఎస్పీ జయలక్ష్మి తీవ్రంగా హెచ్చరించడంతో కొంతకాలం జూదక్రీడకు తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement