ప్రతి మదిలో నీ జ్ఞాపకాలే రాజన్నా | Guntur district had a special place in YSR's heart | Sakshi
Sakshi News home page

ప్రతి మదిలో నీ జ్ఞాపకాలే రాజన్నా

Sep 2 2018 7:00 AM | Updated on Sep 2 2018 7:43 AM

Guntur district had a special place in YSR's heart  - Sakshi

ఆయన రాజకీయ నాయకుడు కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన మహానేత.. పార్టీలను, కులమతాలను పక్కనపెట్టి అందరికీ సంక్షేమ పథకాలను చేరువచేసి ప్రజల కన్నీరు తుడిచిన మనసున్న మారాజు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించిన మహనీయుడు.. పెద్ద జబ్బులతో అనారోగ్యం బారిన పడి కార్పొరేట్‌ వైద్యం చేయించుకునే స్థోమత లేక భారంగా రోజులీడుస్తున్న పేదలను ఆరోగ్య శ్రీతో ఆదుకుని వారి మోముపై మళ్లీ చిరునవ్వుల పూలు పూయించిన నిజమైన ప్రజా వైద్యుడు.. కరువుకాటకాలతో అల్లాడుతున్న జిల్లా రైతులకు సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయంపై భరోసా నింపిన నిత్య కృషీవలుడు.. ఆయనే ప్రజలు రాజన్నా అంటూ ప్రేమగా పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. ఆయన పాలన కాలం ఓ సువర్ణయుగం.. అందుకే ఆయన దూరమై తొమ్మిదేళ్లు గడిచినా మదిమదినా ఆయన జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. రాజన్నా.. అంటూ ప్రేమగా పలవరిస్తున్నాయి.. 

సాక్షి, అమరావతి బ్యూరో: సంక్షేమ పాలనతో  జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రిగా ఆయనకు ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. పథకాన్ని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు పేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యాన్ని చేరువచేసి, ఎన్నో ప్రాణాలను నిలిపి అపర సంజీవనిగా పేరుపొందిన ఆరోగ్య శ్రీని ప్రారంభించింది ఈ జిల్లాలోనే. 2004 ఎన్నికల్లో టీడీపీ కంచుకోట లాంటి ఈ జిల్లా నుంచి మొత్తం 19 నియోజకవర్గాలకు 18 మందిని ఎమ్మెల్యేలుగా ఒంటిచేత్తో గెలిపించి సత్తాచాటారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన ఈ జిల్లాపై ఆయన ఎంతో మక్కువ. కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేసేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 

ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు. అందుకే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పాలన అందించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి ప్రజల కన్నీరు తుడిచారు. ఆయన పాలన అన్ని వర్గాల ప్రజలకు ఓ సువర్ణయుగం. పేదలు తలెత్తుకుని కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేలా ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దారు. రైతుల బతకు చిత్రాన్ని మార్చే క్రమంలో  లక్షా 50 వేల కోట్ల రూపాయల అంచనాతో జలయజ్ఞం కింద రాష్ట్రంలో 86 ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో మొట్టమొదటి ప్రాజెక్టుగా జిల్లా రైతుల స్థితిగతులను మార్చే పులిచింతలను ప్రారంభించారు. వైఎస్సార్‌ చివరి సంతకం చేసిన ఫైల్‌ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చినదే. ఈ బీమాతో జిల్లాలో రూ.17 కోట్లకుపైగా లబ్ధిపొందారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మిర్చిపంటకు ప్రయోగాత్మకంగా బీమా అమలు చేసి రైతుల పక్షపాతిగా నిలిచారు. ఆయన దూరమై తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన మరణం ఓ కలగానే ఉందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతిని శనివారం జిల్లా వ్యప్తంగా నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతోపాటు వైఎస్సార్‌ అభిమానులు సైతం ఆ మహానేతకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  మహానేత ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్‌ మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసి రైతుల ఆశలను నిలువునా ముంచాయి.  

జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 
జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరుకు వైఎస్‌ అధిక ప్రాధాన్యాన్ని కల్పించారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులను కేటాయించటంతోపాటు పథకాల అమలులో పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రూ.12 వేల కోట్ల రుణ మాఫీలో జిల్లా రైతులకు రూ.560 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభను జిల్లాలో ప్రారంభించి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. గ్రామాలకు తాగునీరు అందించి పల్లెవాసుల మనసులో చెరగని ముద్రవేశారు. గుంటూరు దాహార్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్లపాడు రావాటర్‌ ప్లాంటు నుంచి తక్కెళ్లపాటు నీటిశుద్ధి ప్లాంటు వరకు రెండో పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. తమ నీటికష్టాలు తీర్చిన మహానేతను నగరవాసులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. రూ.460 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. 

నీటిపారుదల రంగం అభివృద్ధి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే గుంటూరు జిల్లాలో జలయజ్ఞం పథకం కింద పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం, నాగార్జున సాగర్, జవహర్‌ కాలువలు, కృష్ణా, పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. మొత్తం మీద నీటిపారుదల రంగానికి దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చుచేసి జిల్లా రూపు రేఖలనే మార్చారు. 

డెల్టాకు గుండె.. పులిచింతల
గుంటూరు, కృష్ణా జిల్లాలకు పులిచింతల ప్రాజెక్టు గుండె వంటిది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు, కృష్ణా పశ్చిమ డెల్టాకు ఆయువుపట్టు లాంటిది పులిచింతల. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్‌ 15వ తేదీన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.682 కోట్లతో పనులు చేపట్టారు. ప్రాజెక్టు సామర్థ్యం 47.45 టీఎంసీలు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తికావచ్చిన దశలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పులిచింతల నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేయలేని దుస్థితి దాపురించింది.

దాహార్తి తీర్చేందుకు..
గుంటూరు నగరంలో తాగునీటి కష్టాలు తీర్చేం దుకు రూ.480 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో తాగునీటి పథకానికి తొలుత దివంగత మహా నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. తెనాలిలో నగరబాటలో భాగంగా 2008 జనవరిలో రూ.97 కోటతో రక్షిత మంచి నీటి పథకానికి ఆయనే శంకుస్థాపన చేశారు. 

ఐదేళ్లలో 57సార్లు పర్యటన
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రీ తిరగని రీతిలో డాక్టర్‌ రాజశేఖరరెడ్డి 57 సార్లు గుంటూరు జిల్లాలో పర్యటించారు. దీనిని బట్టే ఆయనకు జిల్లా ప్రజలపై ఎంతటి మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ప్రజ లకు చిరకాల స్వప్నంగా నిలిచిపోయిన పులిచింతల ప్రాజెక్టును 2004 అక్టోబర్‌ 15వ తేదీన రూ.682 కోట్లతో శంకుస్థాపన చేశారు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన అంకురార్పణ చేశారు. ఇందిరప్రభ ద్వారా 13 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచారు. రాజీవ్‌
పల్లెబాట కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. దుర్గి మార్కెట్‌ యార్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు.  

సాగర్‌ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు
నాగార్జున సాగర్‌ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 2008లో రూ.4444 కోట్లతో చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే గుంటూరు జిల్లా పరిధిలోని ప్రధాన కాలువ, బ్రాంచ్‌ కాలువ ఆధునికీకరణ పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టారు. కుడికాలువ పరిధిలో లైనింగ్‌ పనులను చేపట్టారు. ఈ పనులను 2018 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. అయితే ఇప్పటి వరకు రూ.2,832.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా 48 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 52 శాతం. అయితే అప్పటి డాలర్‌ మారకం విలువకు, ప్రస్తుతం డాలర్‌ మారకం విలువకు తేడా ఉన్నందున అదనంగా రూ.900 కోట్లతో పనులు చేసుకోవచ్చని ఇటీవల ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ నిధులు మురిగిపోయాయి. జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనుల కోసం 2008లో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.835.33 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో కేవలం రూ.390.83 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 

ఈ జీవితం రాజన్న చలవే
నేను వ్యవసాయ కూలీని.  రెక్కల కష్టం తోనే జీవనం. 2012లో గుండె జబ్బు వచ్చింది. డాక్టర్లు అర్జంటుగా ఆపరేషను చేయాలన్నారు. డబ్బులెట్టారా బగమంతుడా..? అనుకుని మథనపడుతుంటే, వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును గుర్తుచేశారు మావోళ్లు. హమ్మయ్య అనుకుని నిబ్బరంగా కూర్చుండిపోయా. విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రిలో గుండె ఆపరేషను చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుతోనే రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఊరికే చేశారు. మాది రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఆ మహానుభావుడు రాజన్న వల్ల నాకు పునర్జన్మ కలి గింది. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానంటే అది ఆయన చలవే. ఆరోగ్యంగా జీవిస్తూ పొలం పనులకూ వెళ్తున్నా. వైఎస్‌ చేసిన మేలును మా కుటుంబం జీవితంలో మరువదు.
– దేశబోయిన పోతురాజు, గుడివాడ, తెనాలి మండలం, గుంటూరు జిల్లా

వైఎస్‌ను మరువలేం
మాది పేద కుటుంబం. నాన్న పూర్ణశేఖర్‌ రాడ్‌ బెండింగ్‌ వర్కర్‌. నాన్న సంపాదనతో కుటుంబం గడవటం, ఇద్దరు ఆడపిల్లల్ని చదివించడమంటే కష్టం. ఉన్నత చదువులు చదవాలనేది నా ఆశయం. ఇంటర్‌ పూర్తయ్యాక ఫార్మసీ కోర్సు చేయాలని నా కోరిక. ప్రొఫెషనల్‌ కోర్సు ఫీజులను తట్టుకోలేని ఆర్థికశక్తి నాన్నది. అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వరంలా కని పించింది. వైఎస్‌పై భారం వేసి ఎంసెట్‌ రాశా. అనుకున్నట్టే సీటొచ్చింది. తెనాలి ఏఎస్‌ఎన్‌ ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ (నాలుగేళ్లు), ఆ తర్వాత ఎంఫార్మసీ (రెండేళ్లు) ఉచితంగా పూర్తిచేశా. బీఫార్మసీలో ఏఎంఎన్‌ ప్రొఫెషనల్స్‌ నుంచి ‘బెస్ట్‌ స్టూడెంట్‌ అవార్డు’, ఎంఫార్మసీలో ‘టాప్‌ యాగ్రిగేడ్‌’, పదికి పది సీజీపీఏ సాధించా. నా ప్రతిభను మెచ్చిన కాలేజీ యాజమాన్యం నన్ను టీచింగ్‌ ఫ్యాకల్టీగా తీసుకోవటంతో చదువవగానే ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీ చేయబోతున్నా. వైఎస్‌ లాంటి ఆలోచనలున్న నాయకుడు అధికారంలో ఉంటే నాలాంటి పేదలు ఎందరో ఉన్నత చదువులతో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటారు. నాతోపాటు ఎంతో మందికి ఉచితంగా ఉన్నతవిద్య అందించి, జీవితంలో స్థిరపడేందుకు దారిచూపిన వైఎస్‌ను మరువలేం.
– ఇల్లా ప్రజ్ఞ, టీచింగ్‌ ఫ్యాకల్టీ, ఏఎస్‌ఎన్‌ ఫార్మజీ కాలేజీ, తెనాలి

వైఎస్సార్‌ చలువతోనే మా బిడ్డకు మాటలు  
పండంటి బాబు పుట్టాడని సంబరపడ్డాం. బాబుకు హేమవెంకట శివన్నారాయణగా నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చాం. బాబు ఎదుగుదల బాగున్నా పిలిస్తే పలికేవాడు కాదు. నోట ఒక్క మాటా రాలేదు. వైద్యులను సంప్రదిస్తే బాబుకు పుట్టుకతోనే వినికిడి శక్తి లేదని ఆపరేషన్‌ చేసి, ఏవో యంత్రాలు పెడితే వినగలుగుతాడని తేల్చిచెప్పారు. లక్షల రూపాయల ఖర్చవుతుందన్నారు. మా ఆయన దేవరకొండ కిషోర్‌బాబు చిన్నపాటి టిఫెన్‌ సెంటర్‌ నిర్వహిస్తారు. అంత ఖర్చు భరించే శక్తి మా కుటుంబానికి లేదు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాక మా కష్టాలు తీరాయి. 2010లో హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో బాబుకు రూ.7లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ప్రస్తుతం మా బాబు అన్నీ వినగల్గుతున్నాడు. మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. ఇది వైఎస్సార్‌ చలవే. 
– దేవరకొండ సౌజన్య, చిలకలూరిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement