జననేతకు ఘన నివాళి | YSR Honored In Prakasam | Sakshi
Sakshi News home page

జననేతకు ఘన నివాళి

Published Mon, Sep 3 2018 12:40 PM | Last Updated on Mon, Sep 3 2018 12:40 PM

YSR Honored In Prakasam - Sakshi

ఒంగోలు చర్చి సెంటర్‌లో వైఎస్సార్‌కు నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ శ్రేణులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆదివారం ఆయనకు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా వైఎస్సార్‌ వర్ధంతికార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, వైద్యశిబిరాలు, అన్నదానాలు తదితర సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు.  

ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాజీ మంత్రి వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ తదితరులు పాల్గొని మహానేతకు నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలినేని

ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ పేదల గుండె చప్పుడు అన్నారు.  ఆయనే జీవించి ఉంటే నేడు ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్లేదనే భావన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు.  వైఎస్సార్‌ స్వర్ణయుగం సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయిచేయి కలిపి 2019 ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేద్దామని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. అనంతరం ఒంగోలు నగరంతోపాటు కొత్తపట్నం మండలంలోను అన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాల్లో బాలినేని పాల్గొన్నారు. ఒంగోలు మండలంలోను వైఎస్సార్‌ అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి వైఎస్సార్‌కు నివాళి అర్పించారు.

కనిగిరిలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి చేశారు. మెగా రక్తదాన శిబిరం, అన్నదాన, వృద్దాశ్రమాలు, ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్‌ పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.  

యర్రగొండపాలెం నియోజకవర్గంలో సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వై.పాలెం, పెద్దారవీడు మండలాల్లోని కార్యక్రమాల్లో ఆదిమూలపు సురేష్‌ స్వయంగా పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు.  యర్రగొండపాలెంలో అన్నదానం చేశారు. పుల్లలచెరువు మండలంలోని ఉమ్మడిచెరువులోను భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.

దర్శి నియోజకవర్గంలో పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌ విగ్రహాలకు, చిత్రపటాల వద్ద నివాళులర్పించడంతోపాటు అన్నదానం, పులిహోర పంపిణీ, పండ్లు పంపిణీ చేశారు. తాళ్లూరులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సాయంత్రం ముండ్లమూరు మండలం నాయుడుపాలెంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొని వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. రాజంపల్లిలో అన్నదానం చేశారు.

గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవి.రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదానంతోపాటు మానసిక వికలాంగుల పాఠశాలకు బియ్యం పంపిణీ చేశారు. బేస్తవారిపేటలో రక్తదాన శిబిరంతోపాటు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.  

మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి ఆ«ధ్వర్యంలో నియోజకవర్గంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మార్కాపురం పట్టణంలోని పాతబస్టాండు సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కంభం రోడ్డులో అన్నదానం చేశారు. వైఎస్సార్‌ జీవించి ఉంటే పశ్చిమ ప్రాంతంలోని ప్రజల కష్టాలు తొలగిపోయేవని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి నేడు ఫ్లోరైడ్‌ రహిత ప్రాంతంగా మారి ఉండేదన్నారు.

కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మాదాసు వెంకయ్య ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మాదాసు వెంకయ్య భారీగా కార్యకర్తలు, నేతలతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. పలుచోట్ల అన్నదానం చేశారు.

కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.  ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించడంతోపాటు పలు చోట్ల అన్నదానం చేశారు. అన్ని మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు స్వయంగా మహీధరరెడ్డి హాజరై వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. పండ్లు పంపిణీ చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి తూమాటి మాధవరావు నగరంలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య, యువనేత కృష్ణప్రసాద్‌ల నేతృత్వంలో అద్దంకి భవానీ సెంటర్‌తోపాటు అన్ని మండలాల్లో అన్నదాన కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. పలుచోట్ల పులిహోర పొట్లాలు,  అల్పాహారం పంపిణీ చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలతోపాటు పలుచోట్ల వైఎస్సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చీరాల నియోజకవర్గం సమన్వయకర్త యడం బాలాజీ నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు మిక్కిలిగా జరిగాయి. రక్తదానం, అన్నదానంతోపాటు రోగులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కాలేజీ వద్ద ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావిరామనాథంబాబు ఆ«ధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల అన్నదానం చేశారు. చినగంజాంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.  

సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకర్‌బాబు నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు జరగ్గా ముఖ్యఅతిథులుగా ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. చీమకుర్తిలో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో టీజేఆర్‌ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. మద్దిపాడు, నాగులుప్పలపాడులలో కూడా పార్టీ ముఖ్యనేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement