గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయం
గుంటూరు: విదేశాల్లో చదువుకోవాలన్నా, అక్కడ ఉంటున్న తమ బంధువులు, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలన్నా గతంలో సామాన్యులు నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇక పాస్‌పోర్టు విషయానికి వస్తే దానిపై అవగాహన లేక పోవడం, నిబంధనలు కఠినతరంగా ఉండేవి. దరఖాస్తు దారులు పెరిగి పోయి పాస్‌పోర్టులు సకాలంలో అందక నానా అవస్థలు పడేవారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి 2012 మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆన్‌లైన్ విధానం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు చేయడం ఆపై విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేయించుకునే వారు. అనంతరం పోలీసుల వెరిఫికేషన్, అప్‌లోడు చేయడం జరిగేది. ఈ తతంగం అంతా పూర్తయి పాస్‌పోర్టు ఇంటికి చేరడానికి 20 నుంచి 30 రోజుల సమయం పట్టేది.
వారం రోజుల వ్యవధిలో...
రెండేళ్ల పాటు ఇదే తరహాలో కొనసాగింది. దరఖాస్తుదారుల సంఖ్య మళ్లీ పెరిగిపోతుండటంతో పాస్‌పోర్టు విభాగంపై జిల్లా ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించారు. నత్తనడకన జరుగుతున్న పోలీస్ వెరిఫికేషన్‌ను వేగంవంతం చేశారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలో 2015లో 15,593, 2016లో 14,673, 2017లో 15,768, 2018 జూన్ చివరి నాటికి 8,931 పాస్‌పోర్టులను జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న రోజునే సమాచారాన్ని స్పెషల్ బ్రాంచ్ అధికారులు డౌన్‌లోడు చేసుకొని మరుసటి రోజున వెరిఫికేషన్ పూర్తి చేసి అదే రోజున మళ్లీ అప్‌లోడు చేస్తున్నారు. దీంతో వారం రోజుల వ్యవధిలో పాస్‌పోర్టు నేరుగా ఇంటికి చేరుతుంది.
గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు
రాజధాని ప్రాంతమైన అర్బన్ జిల్లా పరిధిలో వేగవంతంగా పాస్‌పోర్టుల జారీ కొనసాగుతుండటంతో పెండింగ్‌లో దరఖాస్తులే లేకుండా పోయాయి. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే పాస్‌పోర్టుల జారీలో అర్బన్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఏకంగా ప్రథమ స్థానం సాధించింది. ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని రెన్యూవల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment