passport service
-
పాస్‌పోర్ట్ కావాలనుకునేవారికి గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తత్కాల్, సాధారణ కేటగిరీల్లో పాస్‌పోర్టుల జారీకి సంబంధించి దీర్ఘకాలిక అపాయింట్మెంట్ లభ్యతను తగ్గించేందుకు రాష్ట్రంలోని ఐదు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఈనెల 24న శనివారం కూడా పనిచేయనున్నాయి. అలాగే ఈ వారమంతా ప్రత్యేక తత్కాల్ స్పెషల్ డ్రైవ్‌గా కొనసాగుతుందని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం తెలిపింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్‌లలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలన్నింటిలో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. తత్కాల్ కేటగిరీ కింద అర్హత ఉన్న దరఖాస్తుదారులు మాత్రమే తత్కాల్ అపాయింట్మెంట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తత్కాల్ దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి ఈనెల 19 నుంచి 23 వరకు ప్రతిరోజూ 50 అదనపు తత్కాల్ అపాయింట్మెంట్లను ప్రత్యేక ‘వారం తత్కాల్ డ్రైవ్’ కింద విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా రీషెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్ స్లాట్లు వెబ్‌పోర్టల్‌లో ప్రతిరోజూ వినియోగదారులకు అందుబాటులో ఉంచడంతో పాటు కొత్తగా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?' -
దరఖాస్తు చెయ్యి.. పాస్‌పోర్ట్ పట్టెయ్యి!
గుంటూరు: విదేశాల్లో చదువుకోవాలన్నా, అక్కడ ఉంటున్న తమ బంధువులు, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలన్నా గతంలో సామాన్యులు నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇక పాస్‌పోర్టు విషయానికి వస్తే దానిపై అవగాహన లేక పోవడం, నిబంధనలు కఠినతరంగా ఉండేవి. దరఖాస్తు దారులు పెరిగి పోయి పాస్‌పోర్టులు సకాలంలో అందక నానా అవస్థలు పడేవారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి 2012 మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆన్లైన్ విధానం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేయడం ఆపై విజయవాడలోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లి ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేయించుకునే వారు. అనంతరం పోలీసుల వెరిఫికేషన్, అప్లోడు చేయడం జరిగేది. ఈ తతంగం అంతా పూర్తయి పాస్‌పోర్టు ఇంటికి చేరడానికి 20 నుంచి 30 రోజుల సమయం పట్టేది. వారం రోజుల వ్యవధిలో... రెండేళ్ల పాటు ఇదే తరహాలో కొనసాగింది. దరఖాస్తుదారుల సంఖ్య మళ్లీ పెరిగిపోతుండటంతో పాస్‌పోర్టు విభాగంపై జిల్లా ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించారు. నత్తనడకన జరుగుతున్న పోలీస్ వెరిఫికేషన్‌ను వేగంవంతం చేశారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలో 2015లో 15,593, 2016లో 14,673, 2017లో 15,768, 2018 జూన్ చివరి నాటికి 8,931 పాస్‌పోర్టులను జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న రోజునే సమాచారాన్ని స్పెషల్ బ్రాంచ్ అధికారులు డౌన్లోడు చేసుకొని మరుసటి రోజున వెరిఫికేషన్ పూర్తి చేసి అదే రోజున మళ్లీ అప్లోడు చేస్తున్నారు. దీంతో వారం రోజుల వ్యవధిలో పాస్‌పోర్టు నేరుగా ఇంటికి చేరుతుంది. గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు రాజధాని ప్రాంతమైన అర్బన్ జిల్లా పరిధిలో వేగవంతంగా పాస్‌పోర్టుల జారీ కొనసాగుతుండటంతో పెండింగ్‌లో దరఖాస్తులే లేకుండా పోయాయి. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే పాస్‌పోర్టుల జారీలో అర్బన్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఏకంగా ప్రథమ స్థానం సాధించింది. ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని రెన్యూవల్ చేస్తున్నారు. -
అనంతలోనే పాస్‌పోర్ట్ సేవలు
– శరవేగంగా సాగుతున్న పనులు – అక్టోబర్ నెలలో ప్రారంభించనున్న తపాల శాఖ అనంతపురం రూరల్ : పాస్‌పోర్ట్ కోసం విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఏ ఏ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలో తెలియక రెండు మూడుసార్లు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. పాస్ట్‌పోర్ట్ అవసరం ఉన్నా.. సుదూర ప్రాంతాలు వెళ్లలేక చాలా మంది పాస్‌పోర్ట్ తీసుకోకుండా ఉన్నవారి సంఖ్య జిల్లాలో అధికంగానే ఉంది. ఇక పై ఈ బాధలన్నీ తీరనున్నాయి. అనంతలోనే పాస్‌పోర్ట్ కార్యాలయం: పాస్‌పోర్ట్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అనంతలోనే పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అనంతపురంలోని ప్రధాన తపాల కార్యాలయ ఆవరణంలో పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు తపాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. తపాల కార్యాలయంలోని మూడవ అంతస్తులో దీనికి సంబంధించిన పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు తపాలశాఖ ఆధ్వర్యంలో అందనున్నాయి. ఇక్కడికి రావడం శుభ పరిణామం - సునీల్‌కుమార్, ఎంబీఏ విద్యార్థి, అనంతపురం పాస్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాలు వెళ్లనవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం శుభపరిమాణం. పాస్‌పోర్ట్‌కు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే అదనపు ఖర్చుతో కూడిన పని ఇక్కడే పాస్‌పోర్ట్ కార్యాలయం నెలకొల్పనుండటంతో కష్టాలు తీరనున్నాయి. అక్టోబర్ నెలలో ప్రారంభిస్తాం - చంద్రశేఖర్, సూపరింటెండెంట్, అనంతపురం జిల్లా ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు త్వరతగతిన తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధాన తపాల కార్యాలయం నెలకొల్పుతున్నాం. అక్టోబర్ నెలలో అందుబాటులోకి తీసుకొస్తాం. -
పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం
– కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): పాస్‌పోర్టు సేవా కేంద్రం జిల్లా ప్రజలకు ఓ వరమని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని బుధవారం ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వెతలు స్వయంగా చూశానని, హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి సిఫార్సు లేఖలు కూడా రాయించుకునే వారని తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదిస్తే మొదట క్యాంప్ తరహాలో నిర్వహిస్తామన్నారు. పోస్టాఫీసులకు అనుబంధంగా ప్రధాని 100 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం, అందులో మొదటి విడతలోనే కర్నూలుకు మంజూరు చేయడం అదృష్టమన్నారు. ఉద్దేశం నెరవేరింది.. పాస్‌పోర్టు సేవలు ప్రజల వద్దకు అనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరిందని రీజనల్ పాస్‌పోర్టు అధికారి ఎన్ఎల్పీ.చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 50 అప్లికేషన్లు ప్రాసెస్ చేయగలమని, పూర్తిస్థాయిలో సెంట్రల్ ప్రాసెసింగ్‌తో అనుసంధానమైన తర్వాత ఆ సంఖ్యను 100కు పెంచవచ్చని తెలిపారు. పోస్టల్ డైరెక్టర్ సంతాన రామన్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఙానం పెరగడం వల్ల గతంలో పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీయించుకునేందుకు పట్టే సమయంలో ఏకంగా పాస్‌పోర్టునే తయారు చేయగలుగుతున్నామన్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కర్నూలు చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో మొదటి స్థానం సాధించిన డివిజన్ హెడ్ కెవీ సుబ్బారావుతో పాటు డైరెక్టర్ సంతాన రామన్‌ను ఎంపీ సన్మానించారు. అలాగే పాస్‌పోర్టు కేంద్రం మంజూరుకు కృషి చేసిన ఎంపీని పోస్టల్ అధికారులు సత్కరించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, అదనపు ఎస్పీ షేక్షావలి, వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, పోస్టల్ ఏఎస్పీ నాగానాయక్, పోస్టుమాస్టర్ డేవిడ్ పాల్గొన్నారు. -
పోలీసు విచారణ లేకుండానే పాస్‌పోర్ట్
విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం అధికారి ఎన్ఎల్పీ చౌదరి మర్రిపాలెం (విశాఖపట్నం): పోలీసు విచారణతో సంబంధం లేకుండానే పాస్‌పోర్ట్ మంజూరు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి. చౌదరి గురువారం ప్రకటించారు. సాధారణ పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే అభ్యర్థి దరఖాస్తు సమర్పించే సమయంలో ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, పాన్‌కార్డ్‌తో పాటు ఫారం ‘అనెక్సార్-ఐ’ను అదనంగా సమర్పించాలని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్) లేకుండానే పాస్‌పోర్ట్ జారీ చేస్తామన్నారు. అభ్యర్థి సమర్పించిన పత్రాలు ఆన్లైన్లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. దీనికి ఎటువంటి అదనపు ఫీజులు ఉండవని స్పష్టం చేశారు. -
సీఎస్సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఇకపై కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)ల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం లక్షకు పైగా సీఎస్సీలను ఎంపిక చేసింది. ఈ సెంటర్ల ద్వారా పాస్‌పోర్ట్ సంబంధిత సేవలు అందిస్తారు. ఈ విధానానికి జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికలో 2006లోనే ఆమోదం తెలిపినా ఇప్పటికి కార్యాచరణ మొదలైంది. ఈ సెంటర్లలో పాస్‌పోర్ట్ దరఖాస్తు పూర్తి చేయడం, ఆ దరఖాస్తును ఇంటర్నెట్కు అప్లోడ్ చేయడం, ఫీజులు చెల్లింపు తదితర పనులు నిర్వహిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దీనికోసం రూ.100 నామమాత్రపు రుసుము వసూలుచేస్తారు. తొలుత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లో 15 కేంద్రాల్లో మార్చి రెండవ వారంలో ఈ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. మార్చి చివరినాటికి లేదా ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారం కోసం www.passportindia.gov.in వెబ్సైట్లో చూడొచ్చు. అంతేగాకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1800-258-1800 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కూడా ఫోన్ చేసి పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. గతంలో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభించినా అనుకున్నంతగా అది సఫలం కాలేదు.