పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం | Passport Service Center is a gift | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం

Published Wed, Apr 5 2017 9:53 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM

పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం - Sakshi

పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం

– కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ బుట్టా రేణుక
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): పాస్‌పోర్టు సేవా కేంద్రం జిల్లా ప్రజలకు ఓ వరమని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని బుధవారం ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వెతలు స్వయంగా చూశానని, హైదరాబాద్‌ పాస్‌పోర్టు కార్యాలయానికి సిఫార్సు లేఖలు కూడా రాయించుకునే వారని తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదిస్తే మొదట క్యాంప్‌ తరహాలో నిర్వహిస్తామన్నారు. పోస్టాఫీసులకు అనుబంధంగా ప్రధాని 100 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం, అందులో మొదటి విడతలోనే కర్నూలుకు మంజూరు చేయడం అదృష్టమన్నారు.  
 
ఉద్దేశం నెరవేరింది..
పాస్‌పోర్టు సేవలు ప్రజల వద్దకు అనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరిందని రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ.చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 50 అప్లికేషన్లు ప్రాసెస్‌ చేయగలమని, పూర్తిస్థాయిలో సెంట్రల్‌ ప్రాసెసింగ్‌తో అనుసంధానమైన తర్వాత ఆ సంఖ్యను 100కు పెంచవచ్చని తెలిపారు. పోస్టల్‌ డైరెక్టర్‌ సంతాన రామన్‌ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఙానం పెరగడం వల్ల గతంలో పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో తీయించుకునేందుకు పట్టే సమయంలో ఏకంగా పాస్‌పోర్టునే తయారు చేయగలుగుతున్నామన్నారు.
 
పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కర్నూలు చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. రీజియన్‌ పరిధిలో మొదటి స్థానం సాధించిన డివిజన్‌ హెడ్‌ కెవీ సుబ్బారావుతో పాటు డైరెక్టర్‌ సంతాన రామన్‌ను ఎంపీ సన్మానించారు. అలాగే పాస్‌పోర్టు కేంద్రం మంజూరుకు కృషి చేసిన ఎంపీని పోస్టల్‌ అధికారులు సత్కరించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, అదనపు ఎస్పీ షేక్షావలి, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి, పోస్టల్‌ ఏఎస్పీ నాగానాయక్, పోస్టుమాస్టర్‌ డేవిడ్‌  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement