
మా బాబాయ్‌కి ప్రమోషన్ ఇవ్వాల్సిందే..
►లేకుంటే కౌన్సెలింగ్ నిలిపివేయండి
►అధికారులపై జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ అసహనం
►కౌన్సెలింగ్ వాయిదా వేసిన అధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: ‘మా బాబాయ్‌కి ప్రమోషన్ ఇవ్వకుంటే ఎవ్వరికీ ప్రమోషన్ ఇచ్చేందుకు వీలు లేదు. ప్యానెల్ జాబితాలో పేరు చేర్చి హెచ్‌ఎం కౌన్సెలింగ్ నిర్వహించండి... లేకుంటే మొత్తంగా నిలిపివేయండి.’ అని గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ ఆదేశించారు. తన బంధువుకు పదోన్నతి ఇవ్వని పక్షంలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిపివేయాలని విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలో ఉన్న 31 మంది స్కూల్ అసిస్టెంట్లను బుధవారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరానికి హెచ్‌ఎం కౌన్సెలింగ్‌కు రావాలని సమాచారమిచ్చారు. కౌన్సెలింగ్ ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్న సమయంలో సీనియార్టీ జాబితాపై తనకు అనుమానాలున్నాయని జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ అభ్యంతరం లేవనెత్తారు. పిడుగురాళ్ల ప్రాంతంలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు హలీం బాషాను తన బాబాయ్‌గా పేర్కొన్న జానీమూన్, అతని పేరును చేర్చి పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు.
అయితే ఏడాది క్రితం ఆమోదం పొందిన ప్యానెల్‌లో తాజాగా పేర్లు చేర్చరని డీఈవోతో పాటు సంఘాల నాయకులు ఆమెకు నచ్చజెప్పారు. గురువారం పదవీ విరమణ పొందుతున్న మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ల పేర్లను చేర్చి ఇవాళ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. దీంతో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
హెచ్‌ఎం కౌన్సెలింగ్ వాయిదా వేయడంతో ఫ్యాప్టో, జాక్టో ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పరీక్షా భవన్‌కు చేరుకుని కౌన్సెలింగ్ హాల్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరికి డీఈవో కలెక్టర్ కోన శశిధర్‌తో చర్చించి, గురువారం సాయంత్రం 4.00 గంటలకు యథావిధిగా కౌన్సెలింగ్ జరుపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.