బ్రేక్ వీల్ యాక్సిల్‌లో ఉన్న ఎస్‌ఈజేను తొలగిస్తున్న సిబ్బంది
వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా)/రాజమహేంద్రవరం సిటీ: షాలిమార్ నుంచి నాగర్‌కోయిల్ అప్‌లైన్‌లో వెళుతున్న గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు గురువారం పెను ప్రమాదం తప్పింది. ఎస్–5 బోగీలోని బ్రేక్ వీల్ యాక్సిల్‌లోకి ఎస్‌ఈజే (సెల్ఫ్ ఎడ్జస్టింగ్ జాయింట్), చెక్ రెయిల్ చొచ్చుకుపోవడంతో రైలు కదలికల్లో మార్పు వచ్చింది. దీన్ని గమనించిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని కవిటగ్రహారం గేటు కీ ఉమన్ కె.రాధారాణి పూండి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమిచ్చారు. ఆయన పూండికి అతి సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేటు 381 వద్ద అర్థాంతరంగా రైలు నిలిపివేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. మూడు గంటలపాటు గురుదేవ్ ఎక్స్‌ప్రెస్ పూండిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. నౌపడ ఎస్‌ఎస్‌ఈ చంద్రశేఖరరావు, సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది, రైల్వే ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూండిలోని సంతోషిమాతా వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని కర్ని గురు సహకారంతో చెక్ రైల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు. మరమ్మతుల అనంతరం రైలు విశాఖకు బయలుదేరింది.
మళ్లీ విరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్
చెన్నై నుంచి హౌరా వెళ్లే కోరమండల్ (12842) ఎక్స్‌ప్రెస్ బాలిస్టర్ స్ప్రింగ్ మరోసారి విరగడంతో గురువారం రాత్రి గంటన్నర పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. రైలు స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా ఎస్–9 కోచ్ బాలిస్టర్ స్ప్రింగ్ విరగడాన్ని సీనియర్ గ్రేడ్ టెక్నీషియన్ గుర్తించాడు. విషయాన్ని సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సత్యనారాయణకు చెప్పడంతో అతడు తన సిబ్బందితో వచ్చి గంటన్నర పాటు శ్రమించి కొత్త స్ప్రింగ్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం రైలు రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరింది. కాగా, ఇదే రైలుకి ఈ నెల 21న ఎస్–4 బోగీ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment