
గుట్కా..మస్కా..!
నిషేధం మాటున యథేచ్ఛగా అక్రమ రవాణా
కొద్దిరోజుల్లోనే రూ .కోట్లు గడిస్తున్న వ్యాపారులు
వ్యాపార అడ్డాలుగా మారిన గుంటూరు, నరసరావుపేట
వట్టిచెరుకూరు, వింజనంపాడు తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో నిషేధిత గుట్కా అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గుంటూ రు నగరంతోపాటు, నరసరావుపేట పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి జిల్లాకు భారీగా గుట్కా లోడ్‌లు దిగుమతి చేసుకుని తిరిగి ఇక్కడ నుంచి ఆర్డర్‌లపై సరఫరా చేస్తున్నారు. సొంత వాహనాల్లో రవాణా చేస్తే ఇబ్బందులు వస్తాయని గుర్తించి, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు పెద్దగా దృష్టి సారించరనేది వీరి ఆలోచన.
గుట్కా ప్రాణాంతకమని ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. అయితే జిల్లాలో నిషేధం ఎక్కడా కనిపించడం లేదు. గుంటూరు నగర శివారుల్లో తయారీ కేంద్రాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ముఖ్యంగా వట్టిచెరుకూరు, వింజనంపాడు, ఏటుకూరు రోడ్లలో కొన్ని ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి పాన్‌మసాలా తయారీ పేరుతో లెసైన్స్‌లు పొందుతూ లోపల మాత్రం నిషేధిత ఉత్ప్రేరకాలు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలు నెలకొల్పి తయారు చేస్తున్నా, చిన్నచిన్న బడ్డీ బంకుల్లో అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయాలు ....
గుట్కాలు, మావాలు హానికరం అని తెలిసి ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే నిషేధం అక్రమ వ్యాపారులు, అవినీతి అధికారుల పాలిట వరంగా మారింది. నిషేధం లేని సమయంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరిగేవి. దీంతో ఎమ్మార్పీకే విక్రయించేవారు. అయితే నిషేధం నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగింది. ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తుండటంతో అటు వ్యాపారులు, అక్రమ రవాణాదారులు కోట్లు గడిస్తున్నారు. అక్రమ వ్యాపారులు ఇస్తున్న నెలవారీ మామూళ్లకు కక్కుర్తిపడి అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
దాడులు నిర్వహిస్తూనే ఉన్నాం .. జిల్లాలో దాడులు నిర్వహిస్తూనే ఉన్నాం. 2014లో రూ. 2 కోట్ల విలువ చేసే గుట్కాలను సీజ్‌చేశాం. అమ్మకాలు సాగిస్తున్న వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించి రూ. 40 లక్షల జరిమానాలు విధించాం. గత నెలలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో కోటి రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్‌లను ధ్వంసం చేశాం. అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం అందిస్తే దాడులు నిర్వహిస్తాం. సమాచారం తెలియజేయాలనుకునేవారు 94403 79755 అనే నంబర్‌కు ఫోన్ చేయాలి. - పూర్ణచంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్